mt_logo

హైదరాబాద్‌లో 415 కిలోమీటర్ల మేర నలుమూలలకు మెట్రో సౌకర్యం : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 

నలుమూలలకు మెట్రో సౌకర్యం 

విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 67 వేల 149 కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నది. ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధిని  చేపట్టింది. వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులా మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 69 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి హైదరబాద్‌ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యం  నిర్దేశించింది.కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్ లో 415 కిలో మీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంది. 

పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నేడు తెలంగాణ గ్రామాలు, పట్టణాలు చక్కని మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో అలరారుతున్నాయి.  మన గ్రామాలు, పట్టణాలు దేశ స్థాయిలో మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలను చేకూర్చి పెడుతున్నాయి. ఇటీవల  రాష్ట్రపతి చేతుల మీదుగా 13 జాతీయ అవార్డులను మన స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం రాష్ట్రానికి ఎంతో  గర్వకారణం.

విద్యారంగ వికాసం

దేశవ్యాప్తంగా చూస్తే, గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం మరొకటి లేదు. రాష్ట్రంలో నేడు వెయ్యికి పైబడి గురుకుల జూనియర్ కళాశాలలు కొలువు దీరడం బీఆర్ఎస్  ప్రభుత్వం సృష్టించిన నూతన చరిత్ర. 

భావి భారత పౌరులు బలంగా ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లలోనూ, మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని పాఠశాలలలోనూ విద్యార్థినీ  విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతుంది. హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను సైతం పెంచింది. 

మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి పేరుతో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వం తీసుకున్న వివిధ ప్రోత్సాహక చర్యలతో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు ఉత్తీర్ణత లో  మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.

డబ్బు లేని కారణంగా పేద విద్యార్థులెవరూ ఉన్నత విద్యకు దూరం కావద్దనే ఉదాత్త లక్ష్యంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ను అందిస్తున్నది. నేడు వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వివిధ దేశాల్లో ఉన్నతమైన  చదువులు చదువుకోవడం  ప్రభుత్వ సంకల్ప సిద్ధికి నిదర్శనం.  

ప్రజలకు చేరువగా పాలన

పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం పాలన సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించింది.  

పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ మేటి

పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో  అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దీనికితోడు 24 గంటల నిరంతర విద్యుత్ పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజాన్ని నెలకొల్పింది. నేడు తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. 2 లక్షల 51 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేండ్లలో 17 లక్షల 21 వేల మందికి ఉపాధి లభించింది.  

ఐటీ రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ   ఉద్యోగులు  ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2014 నాటికి ఐటీ ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, 2014 నుంచి 2023 నాటికి 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగాయి.  ఐటీ రంగాన్ని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తూ, ప్రభుత్వం ఐటీ టవర్స్ ను నిర్మించింది. తద్వారా గతానికి భిన్నంగా  అభివృద్ధిని సైతం వికేంద్రీకరిస్తున్నది.