mt_logo

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, అరిగోస తప్పదు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం మాట్లాడుతూ.. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేశాం. కొత్త కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే మేడ్చల్ జిల్లా ఏర్పడేదే కాదని తెలిపారు. మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో చైతన్యవంతులని అన్నారు.  ఇరవై ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిననాడు అందరూ నవ్వులాటగా తీసుకున్నారు. ఆనాడు నా మీద ఎన్నో రకాల నిందలు వేసి, అవమానాలు చేసి, అన్ని రకాల అవహేళనలు చేసిండ్రో మీకందరికీ తెలుసు. ఆనాడు కరెంటు లేదు..మంచినీళ్లు లేవు..సాగునీళ్లు లేవు.. పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు ప్రజల వలసలు పోయే హృదయవిదారకమైన దృశ్యాలుండేవని గుర్తు చేశారు. నాడు భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు ఏఢుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే నేను దు:ఖ పడి, ఆనాటి ముఖ్యమంత్రిని జోలెపట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా సహాయం చెయ్యలేదని తెలిపారు. 
58 ఏండ్లు మనం గోస పడ్డాం
దుర్మార్గమైన పరిపాలనలో తెలంగాణ ప్రజలు రెండవ తరగతి స్థాయి ప్రజలుగా చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ, అవమానాలకు గురయిన సంగతి మనకు తెలిసిందే. ఆనాటి శాసనసభ సమావేశాల్లోనే ‘‘నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను..ఏం చేసుకుంటారో చేస్కొండని’’ అంటే తెలంగాణ ప్రాంతం నాటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఎదురు ప్రశ్నించలేదు. బానిసల్లాగా పడున్నటువంటి దుస్థితి ఉండేదన్నారు. 1956 నాడు ఆనాటి కాంగ్రెస్ నాయకులే కేంద్రానికి లొంగిపోయి, చిన్న పొరపాటు చేస్తే 58 ఏండ్లు మనం గోస పడ్డాం. మంచినీళ్లు కూడా లేనటువంటి భయంకరమైన బాధలు పడ్డాం అన్నారు.  నాడు కరెంటు కోతలతోని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే అన్నారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి, 50 ఏండ్లు మనల్ని రాచిరంపాన పెట్టిందెవరో.. మనం తిరుగుబాటు చేసిన్నాడు మన తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందెవరో మీరందరూ ఒక్కసారి ఆలోచన చెయ్యాలె అన్నారు.  మళ్లీ కాంగ్రెసోళ్ల చేతుల్లో పడితే.. కరెంట్ బాధలతో పరిశ్రమలన్నీ బంద్ అయితయ్ అని తెలిపారు. మీరందరూ ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలెనని మనవి చేశారు. 
ప్రత్యేక బడ్జెట్‌తో మేడ్చల్ అభివృద్ధి 
మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు రూ.350 కోట్లతో మంచినీళ్ల బాధ లేకుండా ఏర్పాట్లు చేసుకున్నామని పేర్కొన్నారు. మేడ్చల్, ఎల్.బి.నగర్, ఉప్పల్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారత దేశాలు. మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలు వస్తుంటారు. వివిధ రకాల పనుల కోసం పేదలు ఇక్కడికి వస్తుంటారు. మేడ్చల్ జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి రాబోయే రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అయిన చామకూర మల్లారెడ్డికి ఘన విజయం చేకూర్చాలని మనవి చేస్తున్నానని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నానని పేర్కొన్నారు.