mt_logo

మాకొద్దీ సీమాంధ్ర దొరతనం

By: కట్టా శేఖర్ రెడ్డి 

పాము పాత చర్మానికి కాలం చెల్లిపోయినప్పుడు కొత్తది ధరించి కుబుసం విడుస్తుంది. కుబుసం విడిచిన పాము కొత్త శక్తితో చురుకుగా పనిచేస్తుంది. ఆధిపత్యశక్తులు, కొల్లగొట్టడం రుచిమరిగిన శక్తులు పాత పార్టీలు, పాత రాజకీయాలకు కాలంచెల్లినప్పుడు కొత్త అవతారం ఎత్తుతాయి. కొత్త శక్తులను ముందుకు తెస్తాయి. చంద్రబాబుకు కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ అవసాన దశలో ఉంది. పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేసీచేసీ ఆ పార్టీ అప్రదిష్టపాలైంది. తెలంగాణవాదాన్ని, కేసీఆర్‌ను దెబ్బకొట్టడానికి ఇప్పుడొక కొత్త శక్తికావాలి. కొత్తనాయకుడు కావాలి. వారి ఆకాంక్షల ప్రతిరూపమే జగన్‌మోహన్‌డ్డి. ఆయన సమైక్యవాదుల కొత్త అవతారం. సీమాంధ్ర ఆధిపత్యశక్తుల కొత్త పెత్తందారు. తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టడానికి, సమైక్యవాదాన్ని నిలబెట్టడానికి మారువేషంలో వస్తున్నపార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.

‘తెలంగాణపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినందుకే మేము ఆ పార్టీకి రాజీనామా చేశాం’ అని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌డ్డి, మరో ఎమ్మెల్యే అమరనాథడ్డి చెప్పారంటే అర్థం ఏమిటి? జగన్ సమైక్యవాదానికి నాయకుడు అని చెప్పడం కాదా? జగన్ మాత్రమే సమైక్య రాష్ట్రాన్ని కాపాడతాడని నమ్మడం కాదా? నిజానికి చంద్రబాబు లేఖను తెలంగాణలో ఎవరూ నమ్మలేదు. అక్కడ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జగన్ వెంట వెళుతున్నవారికి ఈ పరిణామాలు అర్థం అవుతున్నాయా? ఢిల్లీలో కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరోపక్క కేంద్రంలోని పెద్దలతో మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.

‘తెలంగాణ ఇవ్వకుండా ఉంటే, మా నాన్నలాగే మళ్లీ 33 ఎంపీ సీట్లు గెలిపించుకు వచ్చి రాహుల్‌ను ప్రధానిని చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు ఆ మంతనాల సారాంశం. దాని పర్యవసానంగానే కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణపై చర్చల్లో వెనుకకు తగ్గింది. జగన్ తెలంగాణ సమస్యను బలహీనపర్చగలడని కేంద్రం నమ్ముతున్నది. లగడపాటి రాజగోపాల్ వంటివారు సైతం ఇదేవాదాన్ని కేంద్రం వద్ద వినిపించారు. తెలంగాణపై చర్చలు విఫలం కావడానికి ఇదొక కారణం’ అని రాజకీయ విశ్లేషకుడొకరు తెలిపారు.

కాంగ్రెస్‌తో తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకున్నది జగన్. ఇప్పుడు కూడా తెలంగాణకు అడ్డుపడుతున్నది జగనే. ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసత్వాన్నే కొనసాగిస్తున్నారు. తొలి ఆరేళ్లూ తెలంగాణ రాకుండా అడ్డంగా నిలువుగా నిలబడ్డది ఆయనే. మరోరూపంలో ఇప్పుడు ఆయన తనయుడు.

జగన్ అయినా, చంద్రబాబు అయినా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటారు. తెలంగాణ మేము ఇచ్చేవాళ్లం కాదంటారు. నిర్ణయం చేయాల్సింది కేంద్రమే అంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. తెలంగాణకు రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పడం లేదు. అందుకు వారి మనస్సాక్షి అంగీకరించడం లేదు. వ్యతిరేకం కాదు అనడానికి, అనుకూలమని చెప్పడానికి చాలా తేడా ఉంది.

సీమాంధ్ర పార్టీల మాటల మర్మాన్ని అర్థం చేసుకోకపోతే తెలంగాణ ఎల్లకాలం మోసపోతూనే ఉంటుంది. ఒక విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇటు చంద్రబాబు,అటు జగన్ ఇద్దరూ తెలంగాణపై గతంలో మాటతప్పినవారే. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుని తన్నుకుపోయినవారే. డిసెంబరు 10న కట్టగట్టుకుని కుట్రలు చేసినవారే.

‘తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్ణాటకకు చెందిన మొయిలీ రాత్రికి రాత్రి ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఎవరితో చర్చించకుండా, ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ సన్నద్ధం చేయకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా చేస్తారు?’అని చంద్రబాబు డిసెంబరు 9 రాత్రి టీవీ తెరలముందు ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిందంతా నిజమేనా? చిదంబరం, మొయిలీ ఇద్దరూ కలసి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎవరితో చర్చించలేదా? ఎవరినీ సన్నద్ధం చేయలేదా?

అంతకుముందు యాభైయేళ్లుగా తెలంగాణ ఉద్యమం జరుగుతూనే ఉంది. 2004 ఎన్నికల్లో తెలంగాణవాదమే చర్చనీయాంశం. 2009 ఎన్నికల్లో తెలంగాణవాదంపై ఎన్నికలు జరిగాయి. అప్పుడెప్పుడూ ఆంధ్రా ప్రజలు రియాక్షన్ చూపించలేదు. కేసీఆర్‌తో పొత్తుపెట్టుకున్న రాజశేఖర్‌డ్డిని ఆంధ్రాలో గెలిపించారు. 2009లో కేసీఆర్‌తో జతకలిసిన చంద్రబాబును కూడా ఆంధ్రా ప్రజలు 50 స్థానాల్లో గెలిపించారు. 9 డిసెంబరు 2009కి ముందు ఎనిమిదేళ్లుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమాలకు పరాకాష్ఠగా కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. విద్యార్థులు వీధిపోరాటాలకు దిగారు. పార్లమెంటులో, అసెంబ్లీలో చర్చలు జరిగాయి. బిల్లు పెడితే తీర్మానానికి మద్దతు ఇస్తామని చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ శాసనసభా పక్షం తెలంగాణపై నిర్ణయాన్ని సోనియాకు వదిలిపెడుతూ అంతకుముందే తీర్మానం చేసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించింది. సోనియాగాంధీ, ప్రధాని, ప్రణబ్, ఆంటోనీ, చిదంబరం, వీరప్పమొయిలీ…అందరూ ఆ సమావేశాల్లో ఉన్నారు. ఈ సమావేశాలు, చర్చలు, తీర్మానాల ఫలితంగా 9 డిసెంబరు 2009న కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
మరి చంద్రబాబు ఎవరితో చర్చించకుండా నిర్ణయం చేశారని ఎందుకు అబద్ధమాడినట్టు? ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్ నుంచే సీమాంధ్ర ఉద్యమ నాటకానికి ఎందుకు తెరలేపినట్టు?

‘సీమాంధ్రలో ఇంత వ్యతిరేకత, ఇంత ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ చూడలేద’ని చంద్రబాబు ఎందుకు బొంకినట్టు? జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం ఎంపీల చేతుల్లోని ప్లకార్డులు తీసుకుని సమైక్యవాద ఎజెండాను ఎందుకు మోసినట్టు? తెలంగాణవాదులతో పొత్తులు పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేసి, మేనిఫెస్టోల్లో ఆ విషయం ప్రకటించి మోసం చేసిన పార్టీలను ఇప్పుడు ఏ హామీ లేకుండా ఎందుకు నమ్మాలి? ఒకవేళ వీళ్లు ఇప్పుడు హామీ ఇచ్చినా మరోసారి ఆంధ్రా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు డ్రామాలు ఆడించరని నమ్మకం ఏమిటి? పయ్యావుల కేశవ్‌ను, దేవినేని ఉమాను, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కట్టడి చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఇప్పుడు కేంద్రానికి లేఖ ఇచ్చే విషయంపైనే వారిని ఒప్పించలేకపోతున్నారు. వీరిని గెలిపిస్తే రేపు తెలంగాణ అనుకూల తీర్మానం ఎలా చేస్తారు?

జగన్ వెంట చేరుతున్న సీమాంధ్ర నేతలంతా కరడుగట్టిన సమైక్యవాదులే. వాళ్లు తమ అభిప్రాయాలను దాచుకోవడం లేదు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బాహాటంగానే చెప్పారు. పైగా ఆయనను సమర్థిస్తున్నవారంతా హైదరాబాద్‌లో వ్యాపార, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలు నడిపిస్తున్నవారే.

జగన్‌ను గెలిపిస్తే వీరు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరుగనిస్తారా? ఈ పార్టీలను గెలిపిస్తే అసెంబ్లీలో ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం’ చేస్తాయా? ఇవే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపౌరుడూ అడగాల్సిన ప్రశ్నలు.

వ్యక్తులు, పార్టీలు కాదు, వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణం ఇది. వాళ్లు మనుషులే ఇక్కడ, మనసులు అక్కడే. తెలంగాణపై వాళ్ల మాటలన్నీ పెదవుల చివరనుంచి వస్తాయి, హృదయాల్లోంచి రావు.

ఇన్ని అనుభవాల తర్వాత, ఇన్ని మోసాల తర్వాత, ఇన్ని మాటమార్పుల తర్వాత కూడా తెలంగాణ మేలుకోకపోతే జీవితాంతం మోసపోతూనే ఉంటాం. సీమాంధ్ర పార్టీలు ఏవయినా ఒకటే. వాటికి ఎప్పుడూ ద్వైదీభావం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలకు రెండు ప్రాంతాల్లో ప్రయోజనాలుంటాయి కాబట్టి అవి వాటిని అధిగమించి ఎదగలేవు.

సిపిఐ, బిజెపి వంటి సూత్రబద్ధ రాజకీయాలు చేసే పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ అవకాశవాద పార్టీలే.అధికారం రుచి మరిగినవాళ్లు, అధికారంలో ఉన్నవాళ్లు, డబ్బు సంచులతో రాజకీయాలు నడిపిస్తున్నవాళ్లు ఎప్పుడూ చేసే పనినే ఇప్పుడు చంద్రబాబు, జగన్, కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. తెలంగాణవాళ్లతోనే తెలంగాణవాదుల కళ్లు పొడిపించే ప్రయత్నం చేయడం ఆ కుట్రలో భాగమే! తెలంగాణవాళ్లతోనే తెలంగాణ ఉద్యమంపై దాడి చేయించడం వారి వ్యూహంలో భాగమే!

యుద్ధం జరిగే ప్రతిచోటా ఫిఫ్త్ కాలమిస్టులు (విద్రోహ దళం-మన సేనలో ఉంటూ శత్రువుకు సహకరించేవాళ్లు) ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి విద్రోహ దళాలు చాలా ఉన్నా యి. ఒకడు బాబు జేబులో కూర్చుని తెలంగాణ ఉద్యమంపైన విషం చిమ్ముతుంటాడు. మరొకడు జగన్ కనుసైగల కనుగుణంగా తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా సభలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తుంటాడు. ఇంకొకడు సేవ చేసుకోవడానికి జగనయినా పర్వాలేదు, చంద్రబాబు అయినా పర్వాలేదు,

తెలంగాణవాడు మాత్రం నాయకుడుగా రావడానికి వీళ్లేదని మేధాగోష్టులు నిర్వహిస్తుంటాడు. సీమాంధ్ర దొరలకు ఎంత భజన చేసినా పర్వాలేదు తెలంగాణ నాయకులకు మాత్రం చేయూతనివ్వం-ఇదీ వారి తత్వం. ఇది కోవర్టుల యుగం. ఇంటి దొంగల కాలం. వీళ్లను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. వీళ్ల నిజస్వరూపాలను పసిగట్టవలసిన తరుణం వచ్చింది. అంతిమంగా వీళ్లు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారో, ఎవరికి ఉపయోగపడుతున్నారో గుర్తించాల్సిన అవసరం ఉంది. చిత్త శుద్ధితో తెలంగాణ కోసం పాటుపడుతున్న శక్తులన్నీ ఒక్కటైతే సీమాంధ్ర పార్టీలు, ఈ ఇంటి దొంగలు ఏకాకులవుతారు.

బిజెపితో కుదరదనుకుంటే టీఆస్, సిపిఐ, న్యూడెమాక్రసీ, నాగం జనార్దన్‌రెడ్డి అందరూ ఒక వేదిక మీదకు రావాలి. ఒక సంఘటిత శక్తిగా ఆవిర్భవించాలి. సీమాంధ్ర రాజకీయ పార్టీలకు తెలంగాణ గడ్డపై నూకలు దొరకవని రుజువు చేయాలి. ఇప్పటిదాకా అనేక ప్రయోగాలు చేశాం. అన్ని పార్టీలతో జట్టుకట్టాం. అన్ని పార్టీలూ నమ్మించి మోసం చేశాయి. ఇప్పుడు తెలంగాణ సొంతకాళ్లపై నిలబడాల్సిన తరుణం ఆసన్నమైంది. స్వాతంత్రసమరంలో ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అని పోరాడిన స్ఫూర్తితో ‘మా కొద్దీ సీమాంధ్ర దొరతనం’ అని తెలంగాణ ఎలుగెత్తి చాటాలి.

ఏ కుటుంబంలో ఎంత మంది?

కుటుంబ రాజకీయాల గురించి చర్చకు వస్తే మా మిత్రుడొకరు ఏ కుటుంబం నుంచి ఎంత మంది ఉన్నారో చూద్దామని లెక్కలు వేశాడు. ఎన్‌టిఆర్ కుటుంబం, రాజశేఖర్‌రెడ్డి కుటుంబాల నుంచి పెద్ద జాబితాలే తయారయ్యాయి.

ఎన్‌టిఆర్ కుటుంబం నుంచి చంద్రబాబు, దగ్గుబాటి, పురందేశ్వరి, హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్‌టిఆర్, నారా రామ్మూర్తినాయుడు, జయకృష్ణ, లోకేశ్…..మరి కొంతమంది.

రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నుంచి వైఎస్ జగన్, వైఎస్ వివేకానందరెడ్డి, రవీంద్రనాథడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయమ్మ, షర్మిళమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బాల్నేని శ్రీనివాస్‌రెడ్డి ….శోధిస్తే మరికొంత మంది దొరకవచ్చు. అయినా సీమాంధ్ర పార్టీలు, నాయకులు వారసత్వ రాజకీయాలు చేయవచ్చు. నేరాలు చేయవచ్చు. కోట్లు కూడబెట్టవచ్చు. పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించవచ్చు. వారికి సర్వహక్కులూ ఉండాలి. వాళ్లకు తెలంగాణ ఇంటిదొంగలు ఎంతయినా వంతపాడవచ్చు. తెలంగాణ నాయకులు మాత్రం వారసత్వంగా ఉద్యమా లు కూడా చేయరాదు. ఉద్యమాల ద్వారా ఎదగరాదు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *