mt_logo

రాష్ట్రంలో భారీగా తన కార్యకలాపాలను విస్తరించనున్న లూలూ గ్రూప్.. 500 మందికి ఉపాధి

  • రాష్ట్రంలో తన కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ
  • సిరిసిల్ల ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత
  • తమ పెట్టుబడి ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపిన సంస్థ

తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ప్రముఖ  లులూ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కే. తారక రామారావు తో ఈరోజు దుబాయ్‌లో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలను యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సానుకూల అనుభవాలను దృష్టించుకుని దృష్టిలో ఉంచుకొని లులూ గ్రూప్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆయన తెలియజేశారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ప్రతి ఏటా సుమారు 1000 కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించినందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి అవసరమైన కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి వాటిపైన తమ పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. తమ పెట్టుబడి ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలియజేశారు.