mt_logo

ఈ ఏడాది చివరికల్లా కొత్తగా 11 జిల్లాలు!

పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా మరో 11 జిల్లాలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టారు. సంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, మంచిర్యాల, నాగర్ కర్నూల్, కామారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తారని సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటే రెండవ విడతలో మరో నాలుగు జిల్లాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది. హైదరాబాద్ లో మరో జిల్లా, వనపర్తి, భూపాలపల్లి, ములుగులను ఏర్పాటుచేస్తారని సమాచారం.

మొదటి విడతలో భాగంగా మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తారు. అందులో మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు సిద్దిపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం జిల్లాను, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిని, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంను, నల్గొండ జిల్లాలోని సూర్యాపేటను, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల పట్టణాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రక్రియంతా ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాలని కేసీఆర్ ధృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమసమయంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న హరితహారం కార్యక్రమాల్లో కూడా సీఎం జిల్లాల ఏర్పాటుపై ప్రకటన చేశారు.

జిల్లా కేంద్రాలు అనేక గ్రామాలు, రెవెన్యూ డివిజన్లకు దూరంగా ఉండటంతో ప్రజలు ఏదైనా పనికోసం వెళ్ళాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్నారు. 20 జిల్లాలు ఏర్పాటుచేస్తే 20 మంది జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల సంఖ్య పెరుగుతుందని, ఆర్డీవోలు, తహశీల్దార్ల సంఖ్య కూడా పెరగడం వల్ల ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్తాయని సీఎం ఆలోచన. ఇందుకోసం సీఎంవో కార్యాలయ అధికారులు జిల్లాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అవసరమైన సమాచారాన్ని రెవెన్యూ అధికారుల నుండి తెప్పించుకుంటున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే సరిపోతుందని, జిల్లాలతో పాటు కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, సబ్ డివిజన్లను కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకోవచ్చని కొంతమంది సీనియర్ రెవెన్యూ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *