mt_logo

హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం ఫిస్కర్

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ హైదరాబాద్‌లో ఐటి, డిజిటల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లాస్ ఏంజెల్స్‌లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్ ఫిష్కర్, సి.యఫ్.వో గీతా ఫిస్కర్‌లతో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-వి పాలసీపై చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జెడ్‌ఎఫ్, హ్యుండై వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కెటిఆర్ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్ కంపెనీని కోరారు. కెటిఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు వారు అంగీకరించారు. తమ ఐటి,డిజిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించామని, అయితే తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాదులో సెంటర్ ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆ సంస్థ సిఇఓ హెన్రీక్ ఫిష్కర్ చెప్పారు. ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తమ పరిశోధన, ఇంజనీరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం కెటిఆర్‌కు అందజేశారు. ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును మంత్రి కెటిఆర్ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *