- 12 వేల మందితో తొర్రూరులో భారీగా బైక్ ర్యాలీ
- కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన
- పాలకుర్తిలో 50 పడకల వైద్యశాలకు శంకుస్థాపన
- అనంతరం తొర్రూరులో భారీ బహిరంగ సభ
- ఖమ్మం హైవే రోడ్డు పక్కన, పాలకేంద్రం సమీప స్థలాన్ని కలెక్టర్ శశాం క్‌తో కలిసి పరిశీలించిన మంత్రి
- తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల పార్టీ ముఖ్య నేతలతో ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశాలు

తొర్రూరు,పెద్ద వంగర,రాయపర్తి (పాలకుర్తి నియోజకవర్గం), అక్టోబర్ 7ః రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 9వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన రాక సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన, పాలకుర్తిలో 17 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల వైద్యశాలకు శంకుస్థాపనలు కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్నాయి. ఇదే సందర్భంగా తొర్రూరులో 20వేల మందితో భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకు ముందు 12వేల మందితో తొర్రూరులో భారీగా బైకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం మంత్రి, తొర్రూరులో గల ఖమ్మం హై వే రోడ్డు పక్కన, పాలకేంద్రం సమీప స్థలాన్ని కలెక్టర్ శశాంక్ తో పరిశీలించారు. అలాగే తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల్లో ముఖ్య నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. 9వ తేదీన మంత్రి కేటీఆర్ రావడానికి అంగీకరించారు. వారి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఆయా కార్యక్రమాల తర్వాత బైకు ర్యాలీ, బహిరంగ సభలు ఉంటాయి. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, కేవలం 20వేల మందితోనే సభ నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి.
పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అయితే, పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛలైన ముఖ్య కార్యక్రమాలకు కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఆయా సమీక్ష సమావేశాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.