ఇల్లందు: ఇల్లందు పట్టణంలో రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెటర్ స్కోర్ లెక్క…కేసీఆర్ వంద కొట్టాలి అంటే హరిప్రియ గెలిపించాలని అన్నారు. ఒక్క చాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. 11 సార్లు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏమి చేశారని ప్రశ్నించారు. 4కోట్ల ప్రజలకు అభిప్రాయ బేధాలు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని నాకు తెలుసు. ఎన్ని విభేదాలు ఉన్నా అందరం కలిసి పని చేయాల్సిన తరుణం ఇది అని కోరారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంతకం చేయని బీజేపీకి ఓటు వేస్తామా…? అని అడిగారు. డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లో కొమరారం, బోడు నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్ట్‌ను త్వరలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీట్ మాత్రం గెలిచాం..ఈసారి సింహభాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నదని సీఎం కేసీఆర్ కు చెప్పాలని వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి శాశ్వత పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ ప్రాంత సింగరేణి కార్మికులను ఎక్కడికి బదిలీ చేయము, కార్మికులు ఆందోళన చెందవద్దని తెలియజేసారు.