రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్‌లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు.
ఇందిరమ్మ పాలన అంటూ ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరు మహిళ జర్నలిస్ట్‌లు ఏం తప్పు చేశారు.. రేవంత్ రెడ్డి లెక్క అడ్డమైన భాష మాట్లాడారా? ఆయన లెక్క బూతులు తిట్టారా? అని నిలదీశారు.
కొండారెడ్డిపల్లిలలో రైతులకు రుణమాఫీ జరిగిందా అని తెలుసుకోవటానికి వెళితే.. కాంగ్రెస్ గుండాలు దాడి చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా బురదలో నూకేసి, కొట్టి, అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయటం ఎంత హేయమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. రుణమాఫీ వంద శాతం చేసింది నిజమైతే ఎందుకు భయం? ఎందుకు రేవంత్ పుట్టిన ఇంటి ముందట ఇద్దరు ఆడబిడ్డలకు అవమానించారని కేటీఆర్ ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపైన వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.