రైతుల మిత్తితో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక్కసారి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా.. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు అని తెలిపారు.
చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో నుండి పోయినంక మా షాబాద్‌కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు అని అన్నారు.
డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు.. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశాం అని అన్నారు.
ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు.. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారు. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడు అని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి.. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఆగస్ట్ 15 పోయింది.. రుణమాఫీ కాలేదు.. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడు. కేసీఆర్‌ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డాడు అని దుయ్యబట్టారు.
ఆ తర్వాత జులైలో మంత్రివర్గంలో చర్చించి ఏదో విధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారు.అందుకే క్యాబినెట్ మీటింగ్ నాటికి దాన్ని రూ. 31 వేల కోట్లకు తగ్గించారు.. ఇక బడ్జెట్‌లో దాన్ని రూ. 26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. దీని మీద గట్టిగా అడిగితే చెప్ప చేతకాలేదు అని ధ్వజమెత్తారు.
సబితక్క రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదని చెబితే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను అవమానించాడు. ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహారించారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతను నిండు శాసనసభలో అవమానించాడు ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చే సత్తా లేని కారణంగానే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు అని విమర్శించారు.
రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఖమ్మం జిల్లాలో సీఎం చెప్పటంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. దీంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. నీ సొంత ఊళ్లో రైతులకు వంద శాతం రుణమాఫీ అయినట్లు రైతులు చెబితే రాజీనామా చేస్తా అని నేను సవాల్ చేసినా. నా సవాల్‌కు సమాాధానం లేదు.. స్పందన లేదు అని ఎద్దేవా చేశారు.
రూ. 49 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు తీసుకొచ్చారు.. అదన్నా నిజం అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం గారు రైతులకు రూ. 7,500 కోట్లు మాత్రమే వేసినం అని ఆయనే చెప్పారు. ఎక్కడ రూ. 49 వేల కోట్లు.. ఎక్కడి రూ. 7,500 కోట్లు. అంటే రూ. 7,500 కోట్లతోనే దీన్ని ఇక్కడికే ఖతం చేద్దామని చూస్తున్నారు.. రైతన్నలు ఆలోచించాలి. మోసం చేసినోన్ని గల్లా పట్టి నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం రుణం మాఫీ అయితదని అనుకున్నా అని నర్సాపూర్‌లో ఒక రైతు చెప్పాడు.. 9 నెలల లేటుకు గాను వడ్డీ అడుగుతున్నారంట. రైతుల మిత్తితో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనన్నదే మా డిమాండ్ అని తెలిపారు.
రుణమాఫీలో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్‌లు పెడుతాడు. మీరు ఇప్పుడు వదిలిస్తే.. తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటు పోతాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 72 మంది లక్షల రైతులకు రైతుబంధు వేశాం.. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నయ్.రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.. మనం అడగాల్సింది అధికారులను కాదు.. కాంగ్రెస్ నాయకులను అడగాలె అని అన్నారు.
ఇవ్వాళ ఇద్దరు మహిళ జర్నలిస్ట్‌లు ఏం పాపం చేశారు. కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి నిజంగా రుణమాఫీ వంద శాతం అయితే ఎందుకు మహిళా జర్నలిస్ట్‌లపై దాడులు చేయించావ్.. వారిని అవమానించావ్. మనం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీయాలి.. అధికారులు చుట్టూ తిరగాల్సిన గర్జు మనకెందుకు? అని అడిగారు.
ఇవ్వాళ్టి పోరాటం మొదటి అడుగు మాత్రమే.. రైతులందరికి మొత్తం రూ. 2 లక్షలు రుణం మాఫీ చేసే వరకు వదిలిపెట్టాం.
మాటలు చెప్పినంత ఈజీ కాదు.. ప్రభుత్వాన్ని నడపటం కాదు. చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు నేరవేర్చకుంటే అదే పని ఆయనకు చేస్తారు. ఏ ఊరిలోకి అయిన సరే వెళ్లి అడుగుదాం.. ఒక్కరైనా నీ పాలనను మెచ్చుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆలోచించాలి.. అన్ని ప్రాజెక్ట్‌లు రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తుండు అని కేటీఆర్ విమర్శించారు
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా.. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు. ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు.. నీ ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల మీద కూడా వెంటపడుతాం. మీరు ఇచ్చినా ఏ హామీకి సంబంధించి అయిన సరే మిమ్మల్ని వెంటాడటమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కటై కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందు పెడదాం అని అన్నారు.
రేవంత్ రెడ్డి లాగా మనం బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు.. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే అని పేర్కొన్నారు.