షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా.. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? అని మండిపడ్డారు.
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా.. ఇంత కర్కశత్వమా.. కొడుకు ముందే చిత్ర హింసలా అని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా.. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. మహిళలంటే ఇంత చిన్నచూపా.. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు.. మరోవైపు దాడులు, దాష్టీకాలు అని కేటీఆర్ విమర్శించారు.
ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు.. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొన్నారు.
వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. బాధిత మహిళలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు అని వ్యాఖ్యానించారు.