పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఓ వైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కఠినమైన చట్టం తెస్తామంటూ ఎన్నికల సందర్భంగా మాటిచ్చి.. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని అన్నారు. తాము మొదటి నుంచి చెబుతున్నట్లుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు.
“పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీ లోకి వెళ్లటం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయటమే. అదే విషయాన్ని కోర్టులు కూడా స్పష్టం చేశాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఉంది. అయినప్పటికీ గౌరవ స్పీకర్ గారు సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకపోవటం దురదృష్టకరం” అని కేటీఆర్ అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు వెళ్లిన సందర్భంలో స్పీకర్ గారి దృష్టికి సుప్రీం తీర్పు అంశాన్ని తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విషయంలో స్పీకర్ గారు పట్టించుకోకపోవటంతో న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు.
మొదటి నుంచి మేము న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మామని కేటీఆర్ చెప్పారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని తేలిపోయిందన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫాంతో ఎంపీగా పోటీ చేయటమంటే ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ది ఎంత లెక్కలేనితనమో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యే విషయంలోనూ వాళ్ల పదవులు పోవటం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలా? లేదంటే వాళ్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసిన ముఖ్యమంత్రి గారిని కొట్టాలో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఏ విధంగానైతే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాడో.. అదే విధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు హామీలిచ్చి ఇప్పుడు చేతులేత్తేశాడన్నారు. రేవంత్ మాటలు నమ్మి అడ్డంగా మోసపోయిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని కేటీఆర్ అన్నారు.
ఇక పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఊసరవెల్లి కూడా రాహుల్ గాంధీని చూసి సిగ్గుపడుతుందన్నారు. ఓవైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపుల విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు పార్టీ మారిన చట్ట సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్ రద్దు చేసేలా చట్టం తెస్తామంటూ హామీ ఇచ్చి మరో వైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా అంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదేం ద్వంద్వ నీతో చెప్పాలని డిమాండ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫించన్ రాకుండా చట్టం చేయటం, కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను వందకోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ ఎత్తుకెళ్తుందని మొత్తుకోవటం చూస్తుంటే దొంగే, దొంగ.. దొంగ అని అరిచినట్లుందన్నారు. తెలంగాణలో ఒక నీతి.. ఇతర రాష్ట్రాల్లో ఒక నీతా? ఇదే విధానమో రాహుల్ గాంధీ గారు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి అటు న్యాయస్థానంలోనూ, ఇటు ప్రజాక్షేత్రం గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బుద్ది చెబుతారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నైజం అర్థం చేసుకోవాలని సూచించారు.