mt_logo

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ విజయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నేను, ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటీషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. హిమాచల్‌లో బీజేపీకి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు అని అన్నారు.

కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు.. ఉప ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తోంది. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపులపై ఎందుకు స్పందించడం లేదు అని అడిగారు.

రేవంత్ రెడ్డికి కారెక్టర్ లేదు.. రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపులపై చెప్పిన మాటలను గౌరవించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి అని అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. దానం నాగేందర్‌ను హైదరాబాద్ రోడ్లపై మేమే ఉరికిస్తాం. రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు అని ఆరోపించారు

అన్ని వ్యవస్థలు పరస్పరం సహరించుకుని పని చేయాలి.. హైకోర్టు చెప్పింది శాసనసభాపతి పాటించాలి అని కౌశిక్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం. మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అని అన్నారు.

స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి.. సీఎం ఆయనపై ఏ ఒత్తిడి తేవొద్దు. కాంగ్రెస్ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి. స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని హితవు పలికారు.

హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది.. అన్ని అసెంబ్లీలకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది అని అన్నారు.