ఫార్ములా-ఈ రేస్ మీద వస్తున్న ఆరోపణలపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొట్టమొదటి కారు రేస్ 1894లో పారిస్‌లో జరిగింది. ఫార్ములా వన్ మొదటి రేస్ 1946లో ఇటలీలో జరిగింది. ఫార్ములా వన్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ రేస్ నిర్వహించేందుకు దేశాలే పోటీ పడతాయి అని అన్నారు.
దేశానికి ఫార్ములా వన్ రేసు రావాలన్న కల ఈనాటిది కాదు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు గారు కూడా 2003లో ఎఫ్1 రేస్ హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గురువు చేయని పనిని మేము చేశాం. అప్పట్లో ఎఫ్ 1 కోసం గోపనపల్లిలో 400 ఎకరాల భూమి సేకరించి డెడికేటేడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి భూ సేకరణపై కేసులో కోర్టులో నడుస్తోంది అని తెలిపారు.
యూపీలో మాయావతి ప్రభుత్వం మొత్తానికి ఎఫ్ 1 రేసును నొయిడాలో జరిపారు. ఎఫ్ 1 రేసు కోసం 2011 లోనే దాదాపు రూ. 1,700 కోట్లు ఖర్చు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్, అదే విధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లో జరిగాయి. కామన్వెల్త్ గేమ్స్ కోసం యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 70,600 కోట్లు. ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసింది అని గుర్తు చేశారు.
ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లు జరిగిన సరే ప్రభుత్వం వాటికోసం ఖర్చు చేస్తోంది. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం కూడా రూ. 103 కోట్లు ఖర్చు చేశారు. క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయటమనేది సర్వసాధారణం. తమిళనాడులో కూడా జరిగిన ఫార్ములా 4 అనే రేసు కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశారు. ఎఫ్ 1 రేసు జరుగుతుంది కనుకే మొనాకో అనే చిన్న దేశం ప్రపంచం మొత్తానికి తెలిసింది. జమ్మూ కశ్మీర్‌లో మోటార్ రేసింగ్ జరిగితే అక్కడ కశ్మీర్‌ను ప్రమోట్ చేస్తూ మోడీ గారు ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ గారికి కూడా మోటార్ రేసింగ్ అనే అభిరుచి ఉంది. దాన్ని నేను అభినందిస్తున్నా అని అన్నారు.
ఎఫ్ 1 రేసు కోసం నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఫార్ములా రేసింగ్‌లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్‌ను ఫార్ములా ఈ-రేస్ అంటారు.ఎఫ్ 1 రేసు రాని కారణంగా మేము ఫార్ములా ఈ-రేస్ తెచ్చే ప్రయత్నం చేశాం అని కేటీఆర్ తెలిపారు.
ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఈ నగరాల చోట హైదరాబాద్‌ను చేర్చాలని మేము ఈ-రేస్‌ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం. మేము ఈ-రేస్ తెచ్చేందుకు చేసి ప్రయత్నంలో సియోల్, జోహన్నస్‌బర్గ్‌ను తలదన్ని మన హైదరాబాద్‌కు ఈ-రేస్‌ను తెెచ్చాం. ఫార్ములా రేసింగ్‌ను మేము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మన హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలని మేము ఈ-రేస్‌ను ఒక అడుగుగా ప్రయత్నం చేశాం అని పేర్కొన్నాడు.
గతంలో పెట్టిన జీనోమ్ వ్యాలీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్‌ను రాజధానిగా చేసింది. అదే విధంగా ఈ-రేస్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కేంద్రం అంటే హైదరాబాద్‌ను గుర్తు చేయాలని మేము అనుకున్నాం. మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గారి కూడా ఈ-రేస్‌కు సంబంధించిన కమిటీలో మెంబర్‌గా చేశాం. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనుకున్నాం. గతంలో బీవైడీ అనే సంస్థ చైనా నుంచి వచ్చేది ఉండే. కానీ చైనాలో గొడవల కారణంగా రాలేదు అని తెలిపారు.
మేము ఈ-రేస్‌కు కోసం ప్రభుత్వం తరపున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే. కానీ హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పింది. అదే కాకుండా అమర్ రాజా బ్యాటరీస్, హ్యుండాయ్ అనే సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాం. మరో సంస్థ రూ. 1200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు పెట్టుబడులు తెచ్చాం అని గుర్తు చేశారు.
ఫార్ములా ఈ-రేస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ప్రాచుర్యం పెరుగుతోంది. ఈ-రేస్‌ను రేస్‌గా కాకుండా మొత్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ యూనివర్సిటీ టెక్నాలజీని పెంపొందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.గతంలో మేము ఈ-రేస్‌ను ప్రమోట్ చేసేందుకు ముంబై వెళితే అక్కడే కేంద్ర మంత్రులు ఈ-రేస్‌ను హైదరాబాద్‌కు మీరు తీసుకెళ్లారు అంటూ ఓపెన్‌గా అన్నారు. ఈ-రేస్ కారణంగా రూ. 700 కోట్ల ప్రయోజనంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాం అని అన్నారు.
మొబిలిటీ వీక్ ద్వారా కూడా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మేము నాలుగేళ్లు, త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాం. నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్‌కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్‌కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుంది. గ్రీన్‌కో అనే సంస్థ లాభం రాలేదని తప్పుకోవటంతో వాళ్లకు నాకు ఇచ్చిన పైసలు ఏముంటాయి? అని కేటీఆర్ అడిగారు.
గ్రీన్‌కో సంస్థ వెళ్లిపోవటంతో ఈ-రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను మేము ఇద్దామని అరవింద్ గారికి చెప్పాను. వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా తెలుసు. ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశాం అని తెలిపారు.
ఇందులో అరవింద్ కుమార్ గారి తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. దానికి ఛైర్మన్ సీఎం, వైస్ ఛైర్మన్ పురపాలక శాఖ మంత్రి. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ. 55 కోట్లు కట్టమని నేనే అరవింద్ కుమార్ గారికి చెప్పాను. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు.. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు అని అన్నారు.
ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశాం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశాం. కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే వాళ్లకు తెలిసిన పని. కానీ నిర్మాణం చేయటం వారికి తెలియదు. అందుకే సీఎంగా ఎన్నికైన వెంటనే ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ రద్దు అంటూ ప్రకటనలు చేశారు. నా మీద కోపంతో అందులో నాకేదో వచ్చిందనుకొని ఏమీ తెలుసుకోకుండా దాన్ని రద్దు చేశారు అని విమర్శించారు.
హైదరాబాద్ ఈ-రేస్‌ను రద్దు చేయటంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థల వాళ్లు సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. మనకు రూ. 700 కోట్లు లాస్ వచ్చింది. కొందరు రాస్తున్నారు కేటీఆర్ చుట్టు ఉచ్చు అని. దీనిలో ఉచ్చు, బొచ్చు అనేది ఏముంది. నిజానికి హైదరాబాద్‌కు ఈ-రేస్ జరగకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు ఆయనపైనే కేసు పెట్టాలి అని దుయ్యబట్టారు.
ఏసీబీ ఫుల్‌ఫామ్ రేవంత్ రెడ్డికి తెలుసా? అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవద్దని నేను ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రూ. 50 కోట్లు ఖర్చు చేశాను. ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటాడు. ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతదా తెలుసా? నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలె. కృష్ణా రెడ్డి మీద ఏసీబీ మీద కేసు పెట్టే దమ్ముందా రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు.
రాఘవ కంపెనీ, మేఘా కంపెనీలకు కేకులు కేసినట్లు ఇచ్చిన పనులకు సంబంధించి కేసులు పెట్టాలె. రూ. 50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి పై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవు. మేము బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తే నువ్వు బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నావు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయా? కేసు పెడితే పెట్టు. హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా? అని ప్రశ్నించారు.
లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు. నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవ్వాళ ఓ పేపర్‌లో టార్గెట్ కేటీఆర్ అని రాశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హమీలపై కదా వాళ్ల టార్గెట్ ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు.
కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు జైల్లో ఉండి మంచిగా యోగా చేసుకొని ట్రిమ్‌గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. రేవంత్ రెడ్డి కనీసం తెలుసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తియ్యకు. ఈ సన్నాసి ఎవరు చెప్పినా సరే వినటం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అని సవాల్ విసిరారు.
రోజుకో రకంగా ప్రచారం చేస్తున్నందుకే మొత్తంగా ఏం జరిగిందో నేనే ప్రజలకు చెబుతున్నా. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని రాజ్ భవన్‌లో ప్రయత్నం చేశారు. అయినా సరే నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ప్రజల తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.