సీఎం, మంత్రుల గురుకుల హాస్టళ్ల బాటపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చింది అని అన్నారు.
సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి.. సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయి. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారు అని దుయ్యబట్టారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి అని డిమాండ్ చేశారు.
ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి అని కేటీఆర్ సూచించారు.