తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుచుతూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నాయకులు ఎత్తుకున్న వాదనలను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. “వాళ్లు కాంగ్రెస్ వాదులు.. తెలంగాణవాదులు కాదు. వాళ్లకు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు” అని స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారని, ఎన్నికల సమయంలో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేశారు. 1978లో వరంగల్ మహిళలతో కలిసి ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారని చెప్పారు.
భారత్ జోడో యాత్రతో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారని చెప్పారు. అంటే.. ఓట్లు ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ నాయకులకు బతుకమ్మ గుర్తుకొస్తుందని, ఓట్ల కోసం ఎన్ని ఆటలైనా ఆడుతారని విమర్శించారు. ఓట్ల అయిపోయిన తర్వాత బతుకమ్మ ఎవరిదని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నాయకులు వెర్రి ప్రశ్నలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారని, మరి రాష్ట్ర పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్న మంత్రుల, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారో, ఏం శిక్ష వేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఆంబోతులను వదిలిట్లు తెలంగాణ ఆడబిడ్డలపై మాట్లాడడానికి మంత్రులను, కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టారా అన్నది ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బతుకమ్మను తాము విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.
అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఇవాళ దేశంలో అనేక విగ్రహాలు దేశంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్, పూలే, సేవాలాల్ మహారాజ్, శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, భరతమాత వంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకు పెట్టున్నారు వాటిని ? గౌరవం ఉంది కాబట్టి పెట్టుకున్నారు కానీ ఎవరో జీవో ఇచ్చారని కాదు. అలాగే, తెలంగాణ విగ్రహాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ నాడు ఉద్యమంలో స్పూర్తి నింపిన తల్లి కాబట్టి ఆ విగ్రహాలు పెట్టుకున్నాం. దేశంలో భరతమాత విగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? మరి తెలంగాణలో మాత్రం కొత్త విగ్రహాన్ని పెట్టి ఈమెనె మీ తల్లి, ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. వేరే విగ్రహం పెడితే కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ చేసింది. బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాతపై గెజిట్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లిపై గెజిట్ ఇవ్వడం చాలా దారుణం.. ఘోరతి ఘోరమైన విషయం అని వ్యాఖ్యానించారు.
ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటామని తేల్చిచెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకుంటామని ప్రకటించారు.
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడానికి ప్రజల ఆమోదం ఉన్నట్లయితే జీవోతో పనేముందని అడిగారు. కేసులు పెడుతామని బెదిరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎందుకింత పిరికితనమని నిలదీశారు. విగ్రహాన్ని కూడా రహస్యంగా తయారు చేయించారని విమర్శించారు. అంత రహస్యంగా విగ్రహాన్ని రూపొందించడానికి ఇదేమైనా ఫ్యూడల్ వ్యవస్థనా, నాజీ ప్రభుత్వమా అని అడిగారు.
ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్న పాటలు చూస్తే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని, తెలంగాణకు సంబంధం లేని పాటలు పాడుతున్నారని, తెలంగాణలో ఎంతో మంది జానపద కళాకారులు ఉంటే.. ఒక్క కళాకారుడు కూడా పాట పాడడానికి దొరకలేదా? పాడడానికి ఒక్క తెలంగాణ పాట దొరకలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను, కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ప్రయత్నం చేశారని, కానీ ఎవరు బుద్ది చెప్పారో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కనిపిస్తోందని వివరించారు.
కేసీఆర్ ది విశాలతత్వమని, రేవంత్ రెడ్డిని సంకుచితత్వం. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ను మించిపోయారని అన్నారు. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి పేరు మీద రాయబడుతాయని స్పష్టం చేశారు.
అలాగే, నీళ్ల కోసం పోరాటం చేసిన తెలంగాణలో.. ఏపీకి అక్రమంగా నీళ్లు మళ్లించడానికి జీవోలు జారీ చేసిన అధికారిని సలహాదారుగా నియమించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకో టీఎంసీ నీటికి కృష్టా నది నుంచి ఎత్తిపోయడానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో ఆదిత్యానాథ్ దాస్ జీవోలు జారీ చేశారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించారంటే.. ఎవరి ప్రయోజనాలను కోరుకొని నియమించారని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న సాంస్కృతిక విధ్వంసం, తెలంగాణ తల్లి రూపం మార్చడం, అధికారిక వేడుకల్లో విష సంస్కృతిని ప్రవేశపెట్టి తెలంగాణ పాటలు కాకుండా వేరే పాటలు పాడించడం వంటి అంశాలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు, ఆయా రంగాల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు