mt_logo

సింగరేణి గనుల వేలంపైన రేవంత్ రెడ్డి మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేంద్రం నేరుగా కేటాయించేలనీ మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు.

ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఉప ముఖ్యమంత్రిని పంపించి మరి సింగరేణి గనుల వేలంలో పాల్గొనడం, ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని తలపిస్తుందన్నారు. గనుల వేలం విషయంలో మారిన తమ వైఖరిని ప్రజలకు వివరించాలని, దీని వెనుక ఉన్న ఒత్తిడిలు ఏంటో ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా మొత్తం సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని, పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారు లేదో తెలపాలన్నారు. గుజరాత్ ఒరిస్సా మాదిరే తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి గనులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతుందన్నారు.

ఈరోజు సింగరేణి గొంతు కోసేలా నిర్వహిస్తున్న గనుల వేలం పాట కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలాంటి ఆందోళన బాధ లేకుండా పాల్గొనడం పైన కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పైన జరుగుతున్న ఈ కుట్రలలో సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ పాల్గొనడం వారికి తెలంగాణ రాష్ట్రం పైన ఉన్న ప్రేమను సూచిస్తుందని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ తెలంగాణపై ప్రేమ సింగరేణి కార్మికులపై అభిమానం లేదన్నారు. వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి..వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిచ్చరన్నారు.

సింగరేణి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ సింగరేణి సంస్థకు మరణశాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి తెలంగాణ ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఫిరాయింపుల డ్రామాకి రేవంత్ రెడ్డి తేరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు నెలలైనా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని అసమర్ధతను కప్పిపుచ్చుకుంటూ ఇలాంటి అనేక డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందనీ, బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందనీ ఆరోపించారు.. ఈ రెండు జాతీయ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే, తెలంగాణ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణ సహజ సంపదను తమ పార్టీ సర్కారు కాపాడితే కాంగ్రెస్ బిజెపిలు వాటిని చెరబడుతున్న ఈ గనుల వేలం సందర్భాన్ని తెలంగాణ చరిత్ర ఎన్నటికీ క్షమించదని ఆవేదన వ్యక్తం చేశారు.