mt_logo

మూసీ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపింది: కేటీఆర్

మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని.. దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

నమామీ గంగే ప్రాజెక్టే రూ. 40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం రూ. లక్షా 50 వేల కోట్లా? ఇందులో మతలబు ఏంటీ? ఇది కుంభకోణం కాక మరేమిటీ? అని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ బాధితుల పాలిట కాలయముడిగా రేవంత్ రెడ్డి మారారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ చెప్పిందా? ఈ సోనియమ్మ చెప్పిందా? పేదల ఇల్లు కూల్చమని? అని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని పేదలందరి తరఫున రాష్ట్ర హైకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్న.. రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ అరాచకాలను పరిగణలోకి తీసుకొని చట్టపకారం వెళ్లామని సూచించిన గౌరవ హైకోర్టుకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

మూసీ బాధితులకు అండగా నిలబడిన మా పార్టీ లీగల్ టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు. మా పార్టీ సీనియర్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ అభినందనలు అని అన్నారు.

వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 300 రోజులు అయిన ఇప్పటిదాకా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలకు అక్కరకు రాని అంశంపైన లక్షన్నరకోట్లు ఖర్చు పెట్టడం ఎవరికోసం? ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్. మీ ప్రాధాన్యతలు ఏంటో చెప్పండి అని అడిగారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. ఇప్పటికీ మీ హామీల అమలు సంగతి గురించి చెప్పటం లేదు. ఏ ప్రాధాన్యం లేకుండా రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు.

ఏం ఆశించి మీరు ప్రాజెక్ట్ చేపట్టారు. ఖజనా ఖాళీ అయ్యింది. అప్పుల కోసమే అప్పులు అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆక్రమణలకు సంబంధించి నేరం చేసిందెవరు? శిక్ష వేసేదెవరికి? అని కేటీఆర్ విమర్శించారు.

1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మరి ఆనాడు రిజిస్ట్రేషన్లు, కరెంట్, వాటర్ బిల్లులు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? పేద, మధ్య తరగతి వాళ్లకు ఇళ్లు అనేది ఒక ఎమోషన్. అలాంటి ఇళ్లును నిర్దాక్ష్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియదు. మాకు తెలుసు అని పేర్కొన్నారు.

అప్పర్ మానేర్, మిడ్ మానేరు ఇలా రెండుసార్లు మేము నిర్వాసితులుగా మారాం. ఆ ఇంటితో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ప్రజలు మీలాగ అయాచితంగా లక్కీడ్రాలో వచ్చినట్లు ఎదగలేరు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చట్టబద్ధంగా అన్ని పర్మిషన్లు వాళ్లకు ఉన్నాయి. అయినా సరే వాళ్లు ఆక్రమణలకు పాల్పడినట్లు మీ కనుగోలు ఆధ్వర్యంలో 500 మందితో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అని మండిపడ్డారు.

2016లో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్, చెరువు మ్యాప్‌లను సిద్ధం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 వరకు కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ చూడకుండా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు మాత్రం ప్రజలను ఆక్రమణదారులు అంటున్నారు. మీకు దమ్ముంటే వాటికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్లు, వాటిని ప్రోత్సహించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలె అని కేటీఆర్ సవాల్ విసిరారు.

లక్షలాది మంది జీవితాలను అంధకారం చేస్తామంటే ఊరుకోం. అసలు ఈ ప్రభుత్వం ప్రాధాన్యాలు ఏంటో చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీలకు మాత్రం పైసలు లేవంట. కానీ మూసీ నది ప్రక్షాళన పేరుతో రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తారంట. 2400 కిలోమీటర్ల నమామీ గంగా ప్రక్షాళన కోసం మొత్తం ఖర్చు చేసిందే రూ. 40 వేల కోట్లు. మాత్రమే. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లా? దీని వెనుక ఉన్న మతలబు ఏంటీ? ఇది స్కాం కాకపోతే ఏంటీ? అని దుయ్యబట్టారు.

అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా ఇళ్లను కూల్చుతున్నారంటే ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తనకే నమ్మకం లేనట్లు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా, జీహెచ్ఎంసీ బిల్డింగ్లను కూలగొట్టాలే. అవి నాలాల మీద ఉన్నాయి. వాటిని మాత్రం కూల్చరంట. కానీ పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లను పంపిస్తున్నారు అని ఆరోపించారు.

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే భావనతో ఎఫ్‌టీఎల్ ఉందని సచివాలయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి కూలగొడుతాడేమో? మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎక్కడున్నారు? ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించిన సరే గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయి అని అన్నారు.

కాళేశ్వరంతో వచ్చే ఆదాయం ఎంత అన్నట్లు మమ్మల్ని అప్పుడు అడిగారు. ప్రపంచంలోనే బహుళార్థ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. లక్షల ఎకరాలకు నీళ్లు, హైదరాబాద్ కు నీళ్ల కరవు లేకుండా చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్టిమెంట్ ఎంత అని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. నీళ్ల కరవు లేకుండా పోయింది. మరి మూసీ ప్రాజెక్ట్ తో మురిసె రైతులెంత మంది? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా? అని తెలపమన్నారు.

సబర్మతి ప్రాజెక్ట్‌కు రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. యుమునా నది ప్రక్షాళనకు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యింది. థేమ్స్ నదికి కూడా వాళ్లు ఖర్చు చేసింది రూ. 40 వేల కోట్ల మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవరికీ ప్రయోజనం, దీనికోసం రేవంత్ రెడ్డిని ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అని అడిగారు.

పక్క రాష్ట్రంలో ఫించన్ పెంచారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు పెంచటం లేదు. ఇప్పటి వరకు రైతుబంధు లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు కట్టిస్తామంటూ చెప్పారు. మీరు ఇళ్లు కూల్చేస్తామంటే కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా పడేది కాదు. రేవంత్ రెడ్డి మీడియాకు మొఖం చాటేసిండు. అధికారులను ముందు పెట్టారు అని ధ్వజమెత్తారు.

ప్రజలు తిడుతుంటే ఆయనకు మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు కాకుండా అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. మీ మంత్రులు మూసీతో ఉండే ప్రయోజనాన్ని ఎందుకు చెప్పటం లేదు. వాస్తవాలను దాచి అధికారుల వెనుక దాక్కుంటే కుదరదు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

ఇళ్లు కూల్చుతుంటే చిన్న పిల్లలు రోడ్డెక్కి ఏడుస్తుంటే వాళ్లు పైసల కోసమే ఏడుస్తూ, తిడుతున్నారంటూ ఓ మంత్రి అంటాడు. మీ మంత్రులు ఒక్కో కుంభకోణాన్ని పంచుకున్నట్లు అనుకున్నారా? శ్రీధర్ బాబు గారు ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడుతారు. మీరు ఇళ్లు కూల్చుతామంటే వాళ్లు ఏడవకుండా ఏమీ చేస్తారు. అలాంటి వాళ్లను అనటానికి శ్రీధర్ బాబుకు ఎలా మనసు వచ్చింది. సావాస దోషంతో శ్రీధర్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి మాదిరిగా చెడిపోయిండు. చిన్న పిల్లల ఆవేదన హైకోర్టుకు అర్థమైంది మీకు కావటం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు చూస్తుంటే నాకే బాధేస్తోంది. ఇంతవరకు ఇలాంటి తిట్లను నేను వినలేదు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం అటు వైపు వెళ్లకండి. ప్రజలు ఏం చేస్తారో తెలియదు. ప్రజలకు అన్యాయం చేస్తామంటే మేము ఊరుకోం. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డంగా ముందుగా మేము అడ్డుగా నిలబడుతాం అని స్పష్టం చేశారు.

ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయండి. నీ అయ్య జాగీరా రూ. లక్షా 50 వేల కోట్లు నీ విలాసాలకు ఖర్చు చేయటానికి? హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. పేదవాళ్లతో పెట్టుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు మీ రేవంత్ రెడ్డికి చెప్పండి అని హితవు పలికారు.

సంగారెడ్డిలో కూల్చివేతలు చేస్తే ఒక వ్యక్తికి తీవ్ర గాయమైంది. అసలు వీళ్లకు ప్లాన్ లేదు.. ప్రణాళిక లేదు. మూసీ సుందరీకరణను మేము పేదల కడపు కొట్టకుండా నాగోల్ వద్ద చేశాం. మూసీ మీద చాలా బ్రిడ్జీలను మంజూరు చేశాం. బ్యూటిఫికేషన్ మేము చేశాం. కానీ పేదల కడుపు కొట్టలేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో…స్పష్టంగా ప్రజలకు చెప్పండి అని అన్నారు.

ఒక్క పేదవానికి కూడా ఇబ్బంది పెట్టకుండా మేము పనులు చేశాం. ఎస్టీపీలను మేమే పూర్తి చేశాం. 15 బ్రిడ్జిలను మేమే మంజూరు చేశాం. ఇక దేనికి మీరు లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మురికి నీళ్లను బాగు చేయకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్ల అవుతా అంటాడు. ఎస్టీపీలను అందుకే కట్టామన్న విషయం ముఖ్యమంత్రికి తెల్వదు.. ఆయనకు సబ్జెక్ట్ తెలియదు. ఎస్టీపీ లేదు కనుక ఇళ్లు కూలగొడుతామంటే.. హైదరాబాద్‌లో ఒక్క ఇళ్లు మిగలదు అని కేటీఆర్ అన్నారు.

మీ ఊళ్లో మీ ఇల్లే ఎఫ్టీఎల్ లో ఉంది. మీ బ్రదర్ ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు నీ ఇళ్లు, నీ అన్న ఇళ్లు కూలగొట్టు. జంట జలశయాలకు 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని మీరే జీవోలు ఇచ్చారు. ముందు మీ మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లు కూలగొట్టు. ఆ తర్వాత పేదల మీదికి రా అని హెచ్చరించారు.

మాదేమే వికాసం, మీదేమో విధ్వంసం. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డిస్ట్రక్షన్ పాలిటిక్స్. మూసీకి సంబంధించి అసలు డీపీఆరే లేదు. అసెంబ్లీలో అడిగినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం లేదు. డీపీఆర్ లేకుండానే ఎందుకు రెడ్ లైన్ వేస్తున్నావు. నువ్వు రెడ్ లైన్లు వేయటం కాదు. మీకు మేము డైడ్‌లైన్ పెడుతున్నాం. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి. తర్వాత మూసీ గురించి పట్టించుకో అని సూచించారు.

మీ డైవర్షన్ పాలిటిక్స్‌కు సంబంధించి వదిలేది లేదు. హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్ మునిగిపోతుందని కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. వీళ్లు రాకముందు హైదరాబాద్ లేదన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తున్నారు. 50 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లు కూల్చుతామంటే మీ అయ్య జాగీరు కాదు. మూసీ బాధితులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం. శ్రీధర్ బాబు గారు అరాచకం అంటున్నారు. అర్ధరాత్రి పేద వాళ్ల ఇళ్లను కూల్చేయటం అరాచకం. పేదవాళ్ల టేలాలు కొట్టేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేము అందరినీ ఒప్పించి కట్టాం. అది కేసీఆర్ గొప్పతనం. చేతనైతే మీరు కూడా ఆ పని చేయండి. ప్రజలకు చెప్పకుండా దొంగచాటుగా సర్వే చేస్తున్నారు. పద్ధతి లేకుండా ఇష్టారీతిన ప్రభుత్వాన్ని నడుపుతామంటే కుదరదు. రేవంత్ రెడ్డి ఏం చేసినా సరే కాంగ్రెస్ ఎంపీల కన్నా బీజేపీ ఎంపీలే కాంగ్రెస్‌కు చెక్క భజన చేస్తున్నారు. భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం జరుగుతోంది. దేశంలో వచ్చే ఎన్నికలకు పైసల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ను రిజర్వ్ బ్యాంక్‌ల వాడుకోవాలని చూస్తోంది అని కేటీఆర్ విమర్శించారు.

రూ. 16 వేల కోట్ల తో పూర్తి చేసే విధంగా మేము మొత్తం మూసీ ప్లాన్‌ను డిజైన్ చేశాం. దానికోసం ఇప్పుడు రూ. లక్షా 50 వేల కోట్ల రూపాయలా? మూసీని ప్రక్షాళణ చేయాల్సిందే. అందుకు కోసం ఎస్టీపీలను మేము కట్టాం అని తెలిపారు.

అసలు మూసీ ప్రాజెక్ట్‌ను ఏం చేస్తున్నారో వాళ్లకే క్లారిటీ లేదు. బ్యూటిఫికేషనా, ప్రక్షాళనా, రివర్ ఫ్రంటా ఏందో వాళ్లకే తెల్వటం లేదు. పేదవాళ్ల గుడిసెలు తొలగించి రియల్ ఎస్టేట్ దందా చేస్తా అంటే పేదవాళ్లు ఒప్పుకుంటారా? మీ ప్రాధ్యాన్యాలు ఏంటీ ? ప్రజలకు ఇచ్చిన హామీలా? లేదంటే మీ సోకుల కోసమా అని అడిగారు.

ఓల్డ్ సిటీకి ఐటీ సంస్థలు రావాలంటే మలక్‌పేట్ ఐటీ టవర్‌ను ముందు పూర్తి చేయాలి. హైదరాబాద్ నిక్షేపంగా ఉంటది. ఎవరి కారణంగా ఆగేది ఉండదు. రివర్ బెడ్, ఎఫ్‌టీఎల్‌లో ఉంటే ప్రభుత్వానికి మానవీయ కోణం ఉండాలి. మా అన్నకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అంటే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.