రాజకీయాల్లో వారం రోజులు అంటే చాలా సమయం అని ఒక కొటేషన్ ఉంటుంది. తెలంగాణ రాజకీయాలు చూసిన వాళ్లెవరికైనా ఈ కోటేషన్ ఎంత నిజమో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకే ఒక్క వారం రోజుల్లో రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన ఆయుధం అనుకున్న హైడ్రాను తుత్తునియలు చేసి, బట్టలిప్పి నడిబజార్లో నిలబెట్టింది బీఆర్ఎస్.
ఇవ్వాళ ఉదయం తెలంగాణ హైకోర్టు హైడ్రా మీద, కమీషనర్ రంగనాధ్ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలు సరైన అదనులో వచ్చాయి. దాదాపుగా గత కొన్ని రోజులుగా హైడ్రాను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ తదితరులు ఏమంటున్నారో అవే ప్రశ్నలను హైకోర్టు అడిగింది.
దీనికి జవాబులు ఇవ్వలేక నీళ్లు నమిలారు అధికారులు. చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేస్తున్నారని, వీటిని వెంటనే ఆపకపోతే అసలు హైడ్రా ఏర్పాటు చేసిన జీవోనే రద్దు చేస్తాం అని హైకోర్టు హెచ్చరించింది. దీంతో అసలు హైడ్రా ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది.
రాష్ట్రం అంతా హైడ్రా విస్తరిస్తాం అని మొన్న రేవంత్ రెడ్డి బీరాలు పలికాడు. మా ఊళ్లో హైడ్రా పెట్టండి అంటూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒవరాక్షన్ చేశారు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున మూసీ నదిలోనే హైడ్రా మునగడంతో ఇప్పుడు అందరి నోళ్లూ మూతపడ్డాయి.
హైడ్రా వచ్చిన నాటి నుండి దాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, జగదీశ్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన పోరాటపటిమ కనబరిచారు.
మెయిన్‌స్ట్రీం మీడియా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహం అయిన వేళ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుని, హైడ్రా బాధితుల వెతలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ గొప్ప విజయం సాధించింది.
ఒకదశలో సోషల్ మీడియాలో బాధితుల వీడియోలు వైరల్ కావడంతో ఇక విధి లేక మెయిన్‌స్ట్రీం మీడియా కూడా అక్రమ కూల్చివేతల కథనాలను ప్రసారం చేయక, ప్రచురించక తప్పని పరిస్థితి కలిగింది.
ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సాధించిన తొలి ఘన విజయం ఇది. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడపొచ్చు అనుకున్న రేవంత్‌కు ప్రజా స్పందన, హైకోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టులా మారింది.
సామాన్యుల వ్యధను బీఆర్ఎస్ ఒక ఉద్యమంగా మార్చిన తీరు ఆనాటి రాష్ట్ర సాధన ఉద్యమం రోజులను గుర్తుకుతెచ్చింది. ఈ స్ఫూర్తితో బీఆర్ఎస్ బెబ్బులిలా తిరగబడడం ఖాయం. ఇక ఇక్కడి నుండి రేవంత్ ప్రభుత్వానికి చుక్కలే.