mt_logo

వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?: కేటీఆర్

కర్నాటక ప్రభుత్వాన్ని కుదిపేస్తోన వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్నా.. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వారిని ఎవరు కాపాడుతున్నారని నిలదీశారు.

వాల్మీకి స్కామ్ వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ అగ్రనేతలు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ. 45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారు? ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివి అని అడిగారు.

V6 పేరుతో ఉన్న బిజినెస్ మీద ఆరోపణలు ఉన్నాయి.. దాని యజమాని ఎవరు? వారికి రూ. 4.5 కోట్లు బదిలీ చేశారా… వాల్మీకి స్కాంకు సంబంధించి హైదరాబాద్‌లో సిట్, సీఐడీ, ఈడీలు దాడులు నిర్వహించిన తర్వాత కూడా ఈ వార్తలు తెలంగాణలోని మీడియాలో ఎందుకు రాలేదు. ఈ వార్తలను కవర్ చేయకుండా అడ్డుకుందెవరు అని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్‌ డ్రా చేశారు. వాటిని ఎవరు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో వీరికి ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు.

వాల్మీకి స్కామ్ లో రూ. 90 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిధ్ధరామయ్య అసెంబ్లీలోనే అంగీకరించారు. అంతే కాదు.. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ఆ మాటల అర్థం ఏమిటి అని ప్రశ్నించారు.

ఈ స్కామ్‌లో హైదరాబాద్ ఉన్న వారి పాత్ర కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ తెలంగాణలో ED ఎందుకు మౌనంగా ఉంది.. ఇక్కడి కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు అని అడిగారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? ఉంటే ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.