వచ్చే బడ్జెట్ సెషన్‌ను 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతితో కేటీఆర్ ప్రభుత్వానికి ఈ సూచన చేశారు.
బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం అసెంబ్లీ సెషన్ సుదీర్ఘంగా సాగింది. 19 పద్దులను ఒకే రోజు పెట్టి చర్చ జరిపి అప్రూవ్ చేసుకునేందుకు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నిర్వహించారు. ఐతే వచ్చేసారి మాత్రం ఇలా ఒకే రోజు ఎక్కువ పద్దులు పెట్టకుండా సభ నిర్వహించేలా ప్లాన్ చేయాలని కేటీఆర్ కోరారు.
ఈసారి కొత్తగా 57 మంది ఎమ్మెల్యేలుగా సభలో అడుగుపెట్టారు.. వారందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే సమావేశాలను మరింత ఎక్కువ రోజులు నిర్వహించాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రోజుకు రెండు, మూడు పద్దులనే పెడితే సభ్యులకు, అదే విధంగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులకు కావాల్సినంత సమయం ఉంటుందన్నారు.
అవసరమైతే వచ్చే సెషన్‌ను 20 రోజులు నిర్వహించాలని కోరారు.. అందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్ తెలిపారు.