బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు కొనసాగించటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫార్మా సిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాల భూమి సేకరించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేసినట్లు పలుమార్లు ప్రకటించిందని గుర్తు చేశారు. మరి ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తే రైతులకు వారి భూములను ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తారో చెప్పాలన్నారు.
గతంలో కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక వేళ ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతులకు భూములు ఎప్పుడు తిరిగి ఇస్తారో చెప్పాలని శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో కేటీఆర్ ప్రశ్నించారు.
అదే విధంగా మూసీ బ్యూటీఫికేషన్‌కు సంబంధించి ఖర్చు భారీగా పెంచేయటంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ బ్యూటీఫికేషన్‌లో కీలకమైన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులను వంద శాతం తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మూసీ బ్యూటీఫికేషన్‌కు రూ. 16 వేల కోట్లతో మా ప్రభుత్వమే డిజైన్లు కూడా పూర్తి చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కానీ ఈ ప్రభుత్వం మూసీ బ్యూటీఫికేషన్ కోసం ఒక్క సారి రూ. 50 వేల కోట్లు అంటోంది. పర్యాటక శాఖ మంత్రి రూ. 75 వేల కోట్లు అంటారు. ఇటీవల గోపన్ పల్లి లో ముఖ్యమంత్రి గారు ఏకంగా లక్షా 50 వేల కోట్ల రూపాయలు అంటారు. అసలు 16 వేల కోట్లతో ఈస్ట్, వెస్ట్ ఎక్స్ ప్రెస్ హైవేతో పాటు మూసీ బ్యూటీఫికేషన్ పూర్తి చేసేందుకు మేము అన్ని సిద్ధం చేశామన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఖర్చు రూ. లక్షా 50 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. దీనికి సంబంధించి భట్టి గారు తమ వద్ద డీపీఆర్ కూడా ఉందని చెప్పారని…ఉంటే ఆ డీపీఆర్‌ను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ లలో భాగంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిది నెలలుగా ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం ఆపేశారన్నారు. బిల్లులు చెల్లించకపోవటం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వెంటనే బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
ఎలివేటేడ్ కారిడర్లు కూడా పూర్తి చేస్తామని ఘనంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కానీ హెచ్ఎండీఏకు సరిపడా బడ్జెట్ కేటాయించలేదు అని అన్నారు . రూ. 5 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలని శాసనసభలో మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.