హైదరాబాద్ నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున జనంపై భారం మోపే ప్రభుత్వ చర్యపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
నగరంలోని అపార్ట్‌మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్ (KW) దాటితే ఆయా అపార్ట్‌మెంట్ వాసులు సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ సంస్థ నోటీసులిస్తుండటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతగాక ఈ ప్రభుత్వం ప్రజలపై భారం వేసే తుగ్లక్ చర్యకు పూనుకుందని ధ్వజమెత్తారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటమేమిటని ప్రశ్నించారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని ఇలాంటి నిబంధన ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీశారు. విద్యుత్ వినియోగం పెరిగితే ఆ భారం ప్రజలపై వేసే ఆలోచన చేయటమంటే.. భవిష్యత్‌లో వినియోగం కూడా పెరిగిందంటూ పైప్‌లైన్లు, రోడ్లను కూడా ప్రజలనే వేసుకోమంటారా అని ప్రశ్నించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి సర్కార్ మరిచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు.
20 కేవీల విద్యుత్ లోడ్ దాటిన అపార్ట్‌మెంట్‌లో సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక్కో అపార్ట్‌మెంట్‌కు దాదాపు రూ. 3 లక్షలు అవసరమవుతాయని కేటీఆర్ చెప్పారు. అంటే ఒక్కో కుటుంబంపై 30 నుంచి రూ. 50 వేలు భారం వేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
అంటే మొత్తం హైదరాబాద్‌లో 20 కేవీ పైగా విద్యుత్ వినియోగం చేసే అపార్ట్‌మెంట్లలో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలపై రూ. 300 కోట్ల భారం పడుతుందని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ప్రజల జేబులకు రూ. 300 కోట్లు చిల్లు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
విద్యుత్ వినియోగం పెరిగితే అందుకు అనుగుణంగా ప్రజలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. పెరిగిన లోడ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేయటమేటనీ కేటీఆర్ ప్రశ్నించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య.. పూర్తిగా ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. వినియోగం పెరిగితే దానికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోవటమంటే అంతకన్నా సిగ్గు పడాల్సిన విషయం మరొకటి లేదన్నారు.
ఈ సంప్రదాయం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని సూచించారు. భవిష్యత్‌లో రహదారుల వినియోగం, నీళ్ల వినియోగం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం పెరిగితే ఆ భారం కూడా ప్రజలపైనే వేస్తారా అని ప్రశ్నించారు. అలా అయితే ఇంకా ప్రభుత్వాలు ఉండి ఏం లాభమని కేటీఆర్ నిలదీశారు.
ప్రజలకు మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆనాలోచిత చర్య కారణంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని ఆశపడి ఓట్లేసినందుకు ప్రజలకు షాక్ ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 300 కోట్లు ప్రజల జేబులకు చిల్లు పెట్టాలన్న దుర్మార్గపూరిత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు శిక్ష వేస్తున్నారని ధ్వజమెత్తారు.
మూసీ, హైడ్రా విషయంలోనూ ఇదే ప్రభుత్వ అధికారులు, బిల్డర్లు చేసిన తప్పుకు పేదలు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయకుండానే అనుమతించిన అధికారులను, వాటిని అమ్మిన బిల్డర్లను వదిలేసి ఇప్పుడు అపార్ట్‌మెంట్ వాసులపై భారం మోపుతారా అని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పునకు మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పెట్టే ఆలోచన మానుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.
ఇప్పటికే లోడ్ పెరిగిందంటూ అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఈ సందర్భంగా ప్రజల సమస్యను కేటీఆర్ ప్రస్తావించారు. కరెంట్ కోతలపై ప్రశ్నిస్తే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని.. నోటీసులు కూడా ఇస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యకు సమర్థించలేదని కేటీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి వెంటనే ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ కోరారు. ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాన్ని తీసుకోకపోతే బాధిత ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.