mt_logo

ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ టాప్‌: కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయటంతో పాటు.. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవన్నీ దివాళాకోరు, తప్పుడు ఆరోపణలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచురితమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ సూచీలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.

ఆర్థిక నిర్వహణలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఇండెక్స్‌ను కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లోనూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన ఈ ఇండెక్స్‌లను కేటీఆర్ ప్రజల ముందుంచారు.

కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక నిర్వహణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో ఈ ఇండెక్స్‌లోని గణంకాలే సాక్ష్యమని చెప్పారు. సత్యాలు, వాస్తవాలు ఇట్లా వుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం పొద్దున లేస్తే దివాలా తీసిన రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను..420 హామీలను అమలు చేయడం చేతగాక అప్పులపై తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.

పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో టాప్‌గా నిలిపిన కేసీఆర్ గారిపై కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు తీర్చటం చేతకాక కేసీఆర్ పై బురద చల్లే కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రం దివాళా తీసింది.. బీఆర్ఎస్ భారీగా అప్పులు చేసిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా డొల్ల అన్నది ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని.. దివాళా తీసిందల్లా కాంగ్రెస్ నాయకత్వం.. వారి బుర్రలేనని మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందున్న వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేస్తామంటే జనం నమ్మరని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ఆర్థిక స్థితిపై కాంగ్రెస్.. బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా అనేక సార్లు పక్కా లెక్కలతో సభ బయట.. వెలుపలా వాస్తవాలను వెల్లిడించామని కేటీఆర్ చెప్పారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్ గణాంకాలు, ప్రధాన మంత్రి ఆర్థిక మండలి రిపోర్టులు,ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ కూడా తెలంగాణ ఆర్థిక సౌష్టవాన్ని, పటిష్ఠతను పదే పదే నిరూపిస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేయటం శోచనీయమన్నారు.

చివరికి.. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేండ్ల తెలంగాణ ఆర్థిక సత్తాను కండ్లకు కట్టే గణాంకాలను చెప్పక తప్పలేదన్నారు. ఇన్ని సత్యాలు కళ్లముందు కనిపిస్తున్నా క్షమించారని విధంగా తప్పుడు ప్రచారాలు చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సత్యమే గెలుస్తుందన్నారు.

సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టేట్ ఓన్ టాక్స్ రెవిన్యూలో టాప్ ప్లేసుల్లో వుంటూ.. స్వంత కాళ్ల మీద నిలబడి స్వయం పోషక రాష్ట్రంగా ఎదిగిందిన్నారు. అప్పుల విషయంలో ఎప్పుడూ ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామన్నారు. జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలిచిన విషయం తెలిసినప్పటికీ తప్పుడు ప్రచారాలతో పైశాచికం పొందారన్నారు.

బీఆర్ఎస్ తీసుకున్న అప్పులు కూడా దీర్ఘకాలం కావటంతో వాటిపై వడ్డీల చెల్లింపు భారం కూడా స్వల్పమేనన్నారు. రెవిన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపు శాతం అతి తక్కువగా వున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ గారు చేసిన అప్పుల్లో సింహాభాగం మూలధన వ్యయం చేశారు. తద్వారా ఆస్తులు, సంపద సృష్టి జరిగిందని కేటీఆర్ చెప్పారు.

కేసీఆర్ గారి పదేండ్ల పాలనలో రాష్ట్రం ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పారు. దశాబ్దాలుగా రాష్ట్రాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద స్టేట్స్‌ను తలదన్నేలా ఒక కొత్త రాష్ట్రం ఎదగడం అద్భుతమని.. దేశాన్ని పోషించే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవటం కేసీఆర్ గారి కృషితోనే సాధ్యమైందన్నారు.

జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి రంగాన్ని కేసీఆర్ టాప్‌లో నిలిపారని గర్వంగా చెబుతానన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా నిర్వహించటం కారణంగానే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు.

తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఇప్పటికైనా ప్రజలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి గాడిన పెట్టిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయవద్దని సూచించారు