mt_logo

కేసీఆర్‌ని బద్నాం చేయాలన్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది: కేటీఆర్

రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తిని నేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు.

నిజానికి వాటికి కూడా ఓ పరిమితి ఉంటుందని కానీ ఆ పరిమితులను దాటి కాంగ్రెస్ కేసీఆర్ గారి మీద దుష్ప్రచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసిందన్నారు.

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ గారిని బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పు బట్టిందన్నారు. కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమని చెప్పారు.

కాంగ్రెస్ చేసే దుష్ర్పచారాలకు దేవుడు కూడా తగిన బుద్ధి చెప్తాడని కేటీఆర్ అన్నారు. ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికి చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యనించారు.