mt_logo

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించినప్పటికీ బాధితులకు పైసా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరద బాధితులంతా తమను ఆదుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ వారికి నిరాశ తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన లో ఎంత మందికి సాయం చేశారో.. ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారో వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

“సీఎం రెండు రోజుల పర్యటనతో ప్రజలకు ఒరిగింది శూన్యం. బాధితుల కష్టాలు తీరలేదు. వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. లక్షల్లో బాధితులుంటే..వందల్లో కూడా సాయం చేయలేదు” అని అన్నారు. వరదల వల్ల సర్వంకోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాల్లోని చిన్న పిల్లలకు కనీసం పాలు, బాధితులకు తాగునీరు, భోజన వసతి కల్పించడంలో కూడా విఫలమయ్యారన్నారు.

లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లితే.. రైతులకు కనీసం పైసా కూడా పరిహారం అందించలేదని మండిపడ్డారు. ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలితే తూతూ మంత్రంగా పదివేలు ప్రకటిస్తారా అంటూ ప్రశ్నించారు. పీఆర్ స్టంట్లతో కాలం గడుపుతామంటే కుదరదని హెచ్చరించారు. బాధితుల కన్నీళ్లు తుడవాల్సిన సీఎం వారిని దరిదాపుల్లోకి కూడా రానీయకుండా ప్రచార రథంపై ఊరేగటమేమిటంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పాలనుకున్న ఆడబిడ్డల ఆర్థానాదాలు కూడా వినకుండా వెళ్లిపోయిన మనసు లేని ముఖ్యమంత్రిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో అడుగడుగునా ప్రజల్లో కనిపించిన కట్టలు తెంచుకున్న ఆగ్రహం మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపించిందన్నారు. సీఎంను కలిసి బాధ చెప్పుకుందామని ప్రయత్నించిన వారిని భద్రతా సిబ్బంది లాగిపారేయడం, లాఠీలు ఝుళిపించడం అత్యంత దారుణమని కేటీఆర్ అన్నారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలంతా ఆగమైన 24 గంటలకు సీఎం మొద్దు నిద్ర వీడారన్నారు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారే తప్ప బాధితుల కష్టాలు తీర్చలేదని ధ్వజమెత్తారు.

ప్రజల కన్నీళ్లు తుడవాల్సింది పోయి సాయం చేద్దామని వచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడిచేయడం అధికారపక్షం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ప్రజల గోడు వినని ముఖ్యమంత్రి పర్యటించినా.. పర్యటించకపోయినా ఒక్కటే. ఈ పరిపాలనా వైఫల్యం కాంగ్రెస్ ఎల్లకాలం వెంటాడుతుందన్నారు. ఖచ్చితంగా చేతగాని, అసమర్థత సీఎంకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.