mt_logo

అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్

అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగించారు. స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం, ఆయన కుటుంబ సభ్యులకు మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అని తెలిపారు.

మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రభుత్వంలోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఆర్బీఐ గవర్నర్‌గా పని చేసిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. ప్రపంచం మొత్తం భారతదేశం గురించి వినాల్సి వస్తుందని తన తొలి బడ్జెట్ ప్రసంగంలో భారతదేశ స్థితిగతులను 1991లో తెలిపిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు అని కొనియాడారు.

మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలను భారతదేశం సాధించింది. సింపుల్ లివింగ్ – హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం. లాయాల్టీ, నిబద్ధత అనేది ఈరోజున్న రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. కానీ తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని అన్నారు.

మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్‌తో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపుల్లో వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ గారు తనకు కేటాయించిన షిప్పింగ్ శాఖను డీఎంకే పార్టీకి వదులుకొని తీర్చారు. స్వయంగా మన్మోహన్ గారి దగ్గరికి వెళ్లి కేసీఆర్ గారు తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఎర్పాటు ముఖ్యమంటూ స్వయంగా షిప్పింగ్ శాఖ డీఎంకేకు ఇవ్వాలని కోరినప్పుడు.. ఈరోజు తెలంగాణ కోసం ఇచ్చిన ఈ పోర్ట్ఫోలియో తెలంగాణ కోసం మిమ్మల్ని ఒక కర్మయోగిగా మారుస్తుందని ఆరోజు మన్మోహన్ సింగ్ కేసీఆర్ గురించి అన్నారు అని కేటీఆర్ గుర్తుచేశారు.

సమయం వచ్చినప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఒక అంశాన్ని కానీ, ఒక వ్యక్తిని గాని ఆపలేదు అన్నది మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం సూచిస్తుంది. ఇదే తెలంగాణ అంశానికి కూడా వర్తిస్తుంది. తెలంగాణ కల సాకరమయ్యే రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అని పేర్కొన్నారు.

డిసెంబర్ 18, 2004న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ నుంచి ఒక ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నామని కేసీఆర్ తెలియజేశారు. తెలంగాణ నుంచి ఓబీసీల డెలిగేషన్ తీసుకువస్తున్నామని చెప్పారు. మీరు కేవలం ఐదు నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కొరితే మన్మోహన్ సింగ్ గారు అంగీకరించారు. ఓబీసీల సమస్యలపైన కేసీఆర్ గారు, ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం గారి ప్రతినిధి బృందానికి 45 నిమిషాల ఇచ్చిన అపాయింట్మెంట్ దాదాపు గంటన్నర పాటు గడిపి అన్ని అంశాలను తెలుసుకున్నారు. దేశస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలన్న అంశంపైన ఆరోజు డెలిగేషన్ ప్రధానమంత్రికి అనేక అంశాలను వివరిచింది. అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని ప్రశంసించారు.

సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారు. తాను మౌనంగా ఉండి, ఎన్ని నిందలు వేసిన సంస్కరణలను అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ ప్రతినిధి బృందం మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలకు హాజరయ్యి వారికి నివాళులు అర్పించాం అని కేటీఆర్ తెలిపారు.

మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడినప్పుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి గురించి కూడా గుర్తు చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారికి దక్కిన గౌరవప్రదమైన వీడ్కోలు మన పీవీ గారికి దక్కలేదన్న బాధ కొంత కలిగింది. మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటుచేసే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు పూర్తి సహకారం అందిస్తాం. మన్మోహన్ గారిని రాజకీయాలకు తీసుకొచ్చి దేశానికి అందించిన పీవీ గారికి ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు.

ప్రధానులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి దేశ రాజధాని ఢిల్లీలో మెమోరియల్ ఉంది కానీ పీవీ గారికి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేరకు మెమోరియల్ ఎర్పాటు కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నాము. సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాం అని ప్రకటించారు.