mt_logo

దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్

మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తమ తీర్పు ఇచ్చారని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగానితనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు.

ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

కుట్రలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధి, వారి ప్రాంతాల కోసం నిబద్దతతో కృషి చేసిన విధానాలపై కూడా కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని మీరు చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు.

ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహా ఇచ్చారు.