mt_logo

నేతన్నల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్.. బతుకమ్మ చీరలు నిలిపివేయడంపై కేటీఆర్ మండిపాటు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామన్నారు. 7 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని గుర్తు చేశారు.

ఏటా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు.

అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతో మంది ఉపాధి పొందే వారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. తమ ప్రభుత్వం మీద కక్షతో నేతన్నలు, చేనేతల ఉసురు తీయవద్దని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆర్డర్లు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాలోచిత చర్యలు మాని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.