సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని యూసుఫ్ గూడ, ముషీరాబాద్‌లో మైనార్టీలతో జరిగిన మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో కేసీఆర్ గారు మైనార్టీల కోసం ఎన్ని పనులు చేశారో గుర్తు చేసుకోండి అని అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో 4 కోట్ల మంది ముస్లింలు ఉంటే రూ. 1,600 కోట్లు మాత్రమే ముస్లింలకు కోసం బడ్జెట్ పెట్టింది. బెంగాల్ దాదాపు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉంటే అక్కడ 2 వేల కోట్లు బడ్జెట్ పెట్టారు. మహారాష్ట్రలో కోటిన్నర ముస్లింలు ఉంటే రూ. 670 కోట్లు, కర్ణాటకలో 80 లక్షల ముస్లింలు ఉంటే రూ. 2 వేల కోట్లు మాత్రమే. అదే తెలంగాణలో మాత్రం 50 లక్షల ముస్లింలు ఉంటే 2,200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది.. మైనార్టీలు, పేదలు సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసింది కేసీఆర్ గారు మాత్రమే అని పేర్కొన్నారు.
తమ రాజకీయాలను ఎప్పుడు చేయలే.. పేదవాళ్లను పేదవాళ్లుగా చూశారు. రంజాన్ వస్తే ముస్లింలకు, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్లకు, బతుకమ్మ పండుగకు హిందువులకు కానుకలుగా ఇచ్చారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారు.. ఒక్కసారి కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాలేదు.. మతం పేరుతో కేసీఆర్ గారు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు అని గుర్తు చేశారు.
204 మైనార్టీ స్కూళ్ళు పెట్టారు.. వందకు పైగా మైనార్టీ మహిళల కోసం స్కూల్ పెట్టారు. ఒక్కో విద్యార్థి పై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడాలని ఆయన భావించారు. మైనార్టీల కోసం 204 స్కూళ్ళు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? మరి ఇప్పుడేమైంది.. ఎవరికైనా రంజాన్ తోఫా వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాను.. ఊరికే ఈ మాటలు చెప్పటం లేదు. రాహుల్ బాబా ఏమో మోడీని చౌకి దార్ చోర్ అంటే మోడీ బడే భాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడు. రాహుల్ బాబా ఏమో అదానీ ఫ్రాడ్ హై అని అంటే.. అదానీ హమారా ఫ్రెండ్ అని రేవంత్ బాబా అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే.. రేవంత్ బాబా మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు. లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయటం సరికాదు అని రాహుల్ బాబా అంటే.. కేసీఆర్ కూతురును అరెస్ట్ చేయటం కరెక్టే.. లిక్కర్ స్కాం జరిగిందని రేవంత్ బాబా అంటాడు. ఆప్ కీ అదాలత్ ప్రొగ్రామ్‌కు పోయి అక్కడ కూడా మోడీకి ఓటు వేయమని చెప్తడు.. ఎవరన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అట్ల చెబుతాడా? ఈయన కూడా బీజేపీలోకి పోతున్నాడు అందుకే ఈ మాట చెప్పాడు అని ధ్వజమెత్తారు.
ఈ మాటలు నేను చెబుతలేను.. బీజేపీకి చెందిన ఎంపీ ఆర్విందే ఆ మాట అన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు బీజేపీని ఎదుగనివ్వలేదని ఆ పార్టీ నాయకుడే చెప్పిండు. 2014, 2019లో దేశంలో బీజేపీ హవా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మోడీని అడ్డుకున్నది కేసీఆర్ మాత్రమే. 2023లో కూడా బీజేపీ తీస్మార్ ఖాన్‌లు అనుకునేటోళ్లను ఓడించి బీఆర్ఎస్సే. బండి సంజయ్, అర్వింద్, ఈటల, రఘునందన్ రావు, సోయం బాబురావు లాంటి వాళ్లను ఓడించింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు.
ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తది.. కానీ వాళ్లు ఏం చేశారో తెలుసా? గోషామహల్‌లో రాజాసింగ్‌ను గెలిపించేందుకు అక్కడ డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ వాళ్లు అక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టింది అని తెలిపారు.
బండి సంజయ్ కూడా గతంలో ఏమన్నాడో తెలుసా? కాంగ్రెస్, బీజేపీ కొట్టుకోవటం కాదు.. ముందు బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని బండి సంజయ్ అన్నాడు.. అంటే కాంగ్రెస్, బీజేపీ దోస్తానా గురించి మనం అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ దేశంలో 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టాడు.. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలే. అదే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆ ప్రయత్నం చేసి ఫెయిలయ్యారు అని కేటిఆర్ అన్నారు.
తెలంగాణ, ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టటం వాళ్ల వల్ల కాలేదు. బీజేపీని ఎదుర్కొనే సత్తా దేశంలో కాంగ్రెస్‌కు లేదు.. ప్రాంతీయ పార్టీలతోనే అది సాధ్యం. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఖచ్చితంగా అది బీజేపీకి మేలు జరుగుతుంది.. మీకే నష్టం జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ బేవకూఫ్ గాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తారు. నిజంగా అలాంటి దోస్తే ఉంటే కేసీఆర్ కూతురు, మా చెల్లెలు 50 రోజులుగా జైల్లో ఉంటుందా? ఒక్క కాంగ్రెస్ లీడర్ అయిన సరే.. వాళ్ల కూతురు, కుమారుడు గాని జైల్లో ఉన్నారా? కేసీఆర్ కూతురు, హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ లాంటి వాళ్లు మాత్రమే బీజేపీని ఎదురించి జైళ్లలో ఉన్నారు. బీజేపీకి బలమైన శక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమే అని అన్నారు.
మమ్మల్ని భయపెట్టి, లొంగదీసుకోవటానికి మోడీ ప్రయత్నించాడు. కానీ మేము తలవంచలేదు. పుట్టేది ఒక్కసారే.. చనిపోయిది ఒక్కసారే.. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీకి తలవంచం. ఇక్కడ పోటీ చేస్తున్న దానం నాగేందర్ మొన్న బీఆర్ఎస్ ఉన్నాడు.. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి రేపు బీజేపీకి పోడు అని గ్యారంటీ ఏంటి. గతంలో కూడా అసిఫ్ నగర్ నుంచి టీడీపీలో పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి పోయిండు అని విమర్శించారు.
ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ మోడీ ఆటలు సాగలేదు.. కానీ కాంగ్రెస్ ఉన్న చోట మోడీని ఎదుర్కొలేకపోయారు. 10 ఏళ్ల క్రితం బడేభాయ్ మోడీ ఎన్నో హామీలు ఇచ్చిండు. రూ. 15 లక్షలు అన్నాడు.. ఎవరి అకౌంట్లోనైనా పైసలు పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటి నల్లా, బుల్లెట్ ట్రైన్ అని చాలా చెప్పిండు..ఇండియా వీసా కోసం అమెరికన్లు మన దగ్గర క్యూలో నిలబడతారని అన్నారు. ఒక్క హామీ అయినా అమలు అయ్యిందా? ఏమి చేయలేదు అని అన్నారు.
మోడీ హయాంలో ప్రతి పేదవాళ్ల పరిస్థితి ఆగమైంది.. అన్ని ధరలు పెరిగినయ్. ఈసారి బీజేపోళ్లు 400 సీట్లు అంటున్నారు.. ఒక వేళ మోడీ గెలిస్తే పెట్రోల్, డిజీల్ రూ. 400 అవుతుంది. మహిళలంతా ఒక్కసారి ఆలోచించాలె.. మోడీ గెలిస్తే గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 4 వేలు అవుతుంది ఆని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.. మే 13న మీరంతా కారు గుర్తుపై ఓటు వేసి పద్మారావు గౌడ్ గారిని గెలిపించండి. 10-12 సీట్లు ఇస్తే చాలు.. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని పేర్కొన్నారు.