అంబర్‌పేట్ నియోజకవర్గం పరిధిలోని గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారు అని అన్నారు.
హైదరాబాద్‌లో ప్రజలు ఓట్లు వేయలేదని పగబట్టి పేదోళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో గుర్తు చేసుకోవాలి. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అని చెప్పిండు. ఎవరికైనా వాళ్లు చెప్పిన పథకాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.
రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలైనయా? మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అన్నట్లు ఉంది ఈ కాంగ్రెస్ వైఖరి. మూసీలో 55 కిలోమీటర్లకు రూ. లక్షా 50 వేల కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తారంట. ఆయన చేసిన పనిని అట్లనే వదిలేద్దామా? అని అడిగారు.
మీ ఇళ్ల మీదికి బుల్డోజర్ వస్తే మీరంత ఒక్కటవ్వాలి. కూలగొట్టటానికి వచ్చినోళ్లనే అడగాలి. మీకు మాలాగా పిల్లలు లేరా అని? ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు కూలగొడుతామని చెప్పలేదు. పేదల ఇళ్లను బొందల గడ్డలు చేసి అక్కడ మాల్‌లు కడతామంటే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
ఇళ్లు కూలగొట్టుమని సోనియా గాంధీ చెప్పిందా? ఇళ్లు కూలగొడతామంటే ఓట్లు వేసే వాళ్లమా? మీకు కష్టం వస్తే మీ ఎమ్మెల్యే వచ్చాడు. మీ ఎంపీ కిషన్ రెడ్డి మాత్రం ఎందుకు మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలసి పేద ప్రజలను ఆగం చేద్దామని మాట్లాడుకున్నారా? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నీయత్‌తో వారికి అండగా ఉంటున్నారో గమనించాలె అని కేటీఆర్ అన్నారు.
దేవుళ్ల పేరుతో చెప్పుకొని ఓట్లు వేయించుకొని ప్రజలకు కష్టం వస్తే పారిపోయేటోడు నాయకుడు ఎట్ల అవుతాడో కిషన్ రెడ్డి చెప్పాలి. ప్రభుత్వం చెబుతున్న లెక్క కన్నా డబుల్ దాదాపు లక్ష మంది ప్రజలను రోడ్లపై పడేసే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇలా అన్ని రద్దు చేశాడు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అన్ని పోతాయి అని మండిపడ్డారు.
గరీబోళ్లకు మంచి చేయమని ఓటు వేస్తే గద్దలాగా తన్నుకుపోతామంటే ఊరుకోం. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో వస్తారు. అందుకే మీరు వాట్సాప్‌లో గ్రూప్ పెట్టుకొని ఒక్క మేసేజ్‌తో అలర్ట్‌గా ఉండాలె అని సూచించారు.
నమామీ గంగా కోసం 2,400 కిలోమీటర్లకు రూ. 20 వేల కోట్లు మోడీ ఖర్చు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 55 కిలో మీటర్ల మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట. మేము కూడా మూసీని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో వంద శాతం మురుగు నీటిని శుద్ది చేసేందుకు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశాం. మూసీ మీద హై లెవల్ బ్రిడ్జిలను 15 మంజూరు చేశాం. అట్ల ప్రజల కోసం మంచి చేశాం అని గుర్తుచేశారు.
మూసీ ప్రాజెక్ట్ చేస్తే చాలా మందికి పేదలకు నష్టం జరుగుతుందని అప్పట్లో సుధీర్ రెడ్డి అన్న చెప్పాడు. అదే విషయం కేసీఆర్ గారికి చెబితే పేదోళ్లకు నష్టం జరగుతుందంటే అసలే వద్దు అని ఆయన చెప్పారు అని తెలిపారు.
కానీ రేవంత్ రెడ్డి ఏమో రూ. లక్షా 50 వేల కోట్లు పెట్టి పేదలను ఆగం చేసి మూసీని ప్రక్షాళన చేస్తాడంట. మేము రూ. 16 వేల కోట్లతో చేయాలనుకున్న మూసీ ప్రాజెక్ట్‌కు పది రెట్లు వ్యయం ఎట్ల పెరిగింది. నిజంగా చేయాలనుకుంటే బాధితులకు మూడు రెట్లు పరిహారం, ఉద్యోగం, డబ్బులు ఇవ్వాలి. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే మేము ఊరుకోం. పేదలకు నష్టం జరగకుండా చూస్తాం అని స్పష్టం చేశారు.
హైకోర్టు తిట్టినప్పటికి సిగ్గు, లజ్జ లేకుండా రేవంత్ రెడ్డి కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తున్నాడంట. నిజంగా నువ్వు మగాడివైతే నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు ముందు అమలు చెయ్. పేదవాళ్ల కోసం మేము లక్ష డబుల్ బెడ్ రూమ్లు కట్టాం. దమ్ముంటే నువ్వు రెండు లక్షలు కట్టు. నలుగురు బ్రోకర్ గాళ్లను పెట్టి మిమ్మల్ని ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు ఐక్యంగా ఉండాలె అని పేర్కొన్నారు.
మీరు ఐక్యమత్యంగా ఉంటే మీతో అంతే గట్టిగా మేము ఉంటాం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే అదే ఓటుతోనే వాళ్లను జాడించి తన్నాలె. ఇంటి ముందుకు వస్తే చీపుళ్లు, రోకల బండ్లతో సిద్ధంగా ఉండండి. రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాటకు వినేరకం కాదు అని అన్నారు.
మీ ఇళ్లపై ఆర్‌బీ-ఎక్స్ అని రాశారు కదా? దాని మీద కేసీఆర్ అని రాయండి. ఎవరు మీ ఇళ్లు కూలగొడుతారో చూద్దాం. పోలీసులు గరీబోళ్ల మీద జులుం చేయకండి. అలా చేస్తే మేము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా ఇచ్చేస్తాం. రూ. పది కోట్లైనా సరే మీకోసం న్యాయపరంగా మేమే కొట్లాడుతాం అని హామీ ఇచ్చారు.