mt_logo

హైడ్రా భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది.. బాధితులకు కేటీఆర్ హామీ

కిషన్‌బాగ్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి ఎలా కాపాడుకోవాలన్న ఆందోళన మీలో ఉంది. పుట్టేది, చనిపోయేది ఒక్కసారే. ధైర్యంగా ఉండండి.. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి తలొగ్గేది లేదు అని భరోసానిచ్చారు.

సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే మేము మీకు న్యాయం జరిగేలా చేస్తా. మీలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు సంఘటితంగా ఉండాలె అని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలంటూ మీ ఓట్లు వేయించుకున్నారు. మహిళలకు రూ. 2,500, అవ్వ, తాతాలకు రూ. 4 వేలు వంద రోజుల్లో చేస్తామన్నారు. మీలో ఎవరికైనా వచ్చాయా? వంద రోజుల్లో చేస్తామని ఏదీ చేయలేదు అని విమర్శించారు.

మూసీ నదిని ప్రక్షాళన చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ పెద్ద, పెద్ద నేతలు పొగుడుతున్నారు. ఈ అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ ఏంటి అని ప్రశ్నించారు.

రాహుల్ బాబా ఏమో బుల్డోజర్ రాజ్ నయి ఛలేగా అంటాడు. మరి తెలంగాణలో పేదల ఇళ్లపైకి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపిస్తుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు. బీజేపీ నేతలు, మీ ఎమ్మెల్యే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు నోరు తెరవటం లేదు అని అడిగారు.

ప్రజలకు మంచి చేయటం కాదు. రూ. లక్షా 50 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు కొల్లగొట్టటమే వీరి పని. పేద ప్రజల శవాలపై మూసీ సుందరీకరణ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు. పేదోళ్ల శత్రువు రేవంత్ రెడ్డి. మీరు సంఘటితంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. బుల్డోజర్లు వస్తే ఒక్క ఫోన్ చేయండి. పది నిమిషాల్లో మీ ముందు ఉంటాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఒక్కరి ఇంటికి బుల్డోజర్ వస్తే అందరూ ఒక్కటి కావాలి. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న ఇళ్లులు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల రాజ భవనాలు హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్‌లో ఉన్నాయి. వాటిని ముందు కూల్చు అని సవాల్ విసిరారు.

కేసీఆర్ గారి ప్రభుత్వంలో మైనార్టీల కోసం ఎంతో సేవ చేశారు. మతం పేరిట రాజకీయాలు చేయలేదు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు మీరు మాకు సపోర్ట్‌గా ఉండండి. రేవంత్ రెడ్డి గూండాల నుంచి మేము మిమ్మల్ని కాపాడుకుంటాం అని స్పష్టం చేశారు.

మీరు సంఘటితంగా ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లక్ష మందిని ఇబ్బంది పెట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అవసరమేమొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏటీఎం అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశాడు. మరి రూ. లక్షా 50 వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్‌తో ఎంత మంది రైతులకు మేలు జరుగుతుంది, ఎంత మందికి ఉపాధి ఇస్తారు అని దుయ్యబట్టారు.

వేల కోట్ల దోపిడీ కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. హైడ్రా అనే భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది. పది కోట్లు ఖర్చైనా సరే మీకు న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టులో మేము పోరాడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.