mt_logo

ఈటల, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్.. ఎన్నికలయ్యాక వాళ్ళిక్కడ ఉండరు: కుషాయిగూడలో కేటీఆర్

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కుషాయిగూడలో జరిగిన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచించాలె అని అన్నారు.

ఎవరికి ఓటు వేస్తే మనకు ప్రయోజనం అవుతుందన్నది. 10 ఏళ్ల క్రితం బడేభాయ్ మోడీ ఎన్నో హామీలు ఇచ్చిండు. రూ. 15 లక్షలు అన్నాడు.. ఎవరి అకౌంట్లోనైనా పైసలు పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటి నల్లా, బుల్లెట్ ట్రైన్ అని చాలా చెప్పిండు. ఒక్క హామీ అయినా అమలు అయ్యిందా? ఏమీ చేయలేదు అని పేర్కొన్నారు.

మోడీ చేస్తోంది ఒక్కటే మనుషుల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తుండు. ముస్లింలకు, పేదలకు ఏమీ చేశావని ప్రధానిని అడిగితే చెప్పుకోవటానికి ఒక్క పని కూడా లేదు. కేసీఆర్ గారు హిందువు.. ఆయన ధర్మాన్ని పాటించారు.. కానీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోలేదు. రంజాన్ తోఫా మీకు వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చాయా?. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మటంతో ప్రజలు మనల్ని ఓడించారు.. పర్వాలేదు అని అన్నారు.

హైదరాబాద్‌లో మీరు నమ్మలేదు.. ఒక్కసీటుకు కూడా కాంగ్రెస్‌కు ఇవ్వలేదు. కానీ గత పదేళ్లలో నీళ్లు, కరెంట్ కష్టాలు ఉండేనా? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలల్లోనే కరెంట్, నీళ్ల కష్టాలు మొదలైనయ్. హిందూ, ముస్లిం అని ఎప్పుడు కేసీఆర్ చూడలేదు.. మనిషిని మనిషిగా చూసి వారి కోసం పని చేశారు అని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారు.. ఒక్కసారి కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాలేదు.. మతం పేరుతో కేసీఆర్ గారు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. 204 మైనార్టీ స్కూల్ పెట్టారు.. వందకు పైగా మైనార్టీ మహిళల కోసం స్కూల్ పెట్టారు. ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారు.. ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడాలని ఆయన భావించారు. మైనార్టీల కోసం 204 స్కూల్ పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? అని అడిగారు.

కాంగ్రెస్‌కు గతంలో ఎన్నో ఏళ్లు మీరు అవకాశం ఇచ్చారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఎందుకు ఇంకా ముస్లింలు పేదరికంలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ను మీరు నమ్మి ఓటు వేసినప్పుడల్లా.. ఆ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో 4 కోట్ల ముస్లింలు ఉంటే రూ. 1,600 కోట్లు మాత్రమే ముస్లింలకు కోసం బడ్జెట్ పెట్టింది. బెంగాల్ దాదాపు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉంటే అక్కడ 2 వేల కోట్లు బడ్జెట్ పెట్టారు. మహారాష్ట్రలో కోటిన్నర ముస్లింలు ఉంటే  రూ. 670 కోట్లు, కర్ణాటకలో 80 లక్షల ముస్లింలు ఉంటే రూ. 2 వేల కోట్లు మాత్రమే. అదే తెలంగాణలో మాత్రం 50 లక్షల ముస్లింలు ఉంటే 2 వేల 2 వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది.. మైనార్టీలు, పేదలు సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసింది కేసీఆర్ గారు మాత్రమే అని స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. 50 రోజులుగా మా చెల్లెలు, కేసీఆర్ గారి కూతురు జైల్లో ఉంది.. నిజంగా బీజేపీతో మాకు ఏదైనా దోస్తీ ఉంటే మా చెల్లెలు జైల్లో ఉండేదా? మోడీ విధానం ఐతే జైల్లో ఉండాలే.. లేదంటే జేబులో ఉండాలే. అందుకు ఒప్పుకోనందుకే కవిత, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ను జైల్లో పెట్టారు. 2014, 2018 బీజేపీని ఓడించిందె బీఆర్ఎస్. 2023లో కూడా బీజేపీ తీస్మార్ ఖాన్లని భావించేవాళ్లందరినీ బీఆర్ఎస్సే ఓడించింది అని తెలిపారు.

పదేళ్లలో మేము చేసిన పని మీ ముందు ఉంది.. అందుకే తొందరపడి ఆగం కావద్దు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది ఖచ్చితంగా బీజేపీకే మేలు అవుతుంది. 542 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందే 300 సీట్లు.. మూడు స్థానాల్లో అల్రెడీ పారిపోయారు. అమేథీలో బీజేపీతో పోటీ పడేందుకు రాహుల్ గాంధీ భయపడుతున్నారు. అలాంటి వ్యక్తి దేశంలో బీజేపీని ఎదుర్కొగలడా? ఒక్కసారి ఆలోచించండి అని కోరారు.

పదేళ్లలో బీజేపీ దేశంలోని కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ లాంటి నాయకుల ప్రభుత్వాలను పడగొట్టాలని చూసి విఫలమైంది. అదే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో మాత్రం అక్కడి ప్రభుత్వాలను సులభంగా పడగొట్టింది.. అంటే బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీల నాయకులకే ఉంది.. కాంగ్రెస్‌కు మాత్రం లేదు అని వ్యాఖ్యానించారు.

బీజేపీకి మేలు చేసేందుకే ఇక్కడ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టింది. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ బాగుండే అని మీకు అనిపిస్తోందా? ఐతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. 13 తారీఖు నాడు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. మీరు 10-12 సీట్లు ఇస్తే చాలు.. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని కేటీఆర్ అన్నారు.

ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్. ఎన్నికలు అయిపోగానే వాళ్లు ఇక్కడ ఉండరు.. రాగిడి లక్ష్మారెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించండి అని పిలుపునిచ్చారు.