mt_logo

లోక్‌సభ ఎన్నికల్లో కుర్‌కురే పార్టీకి.. కిరికిరి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పండి: కేటీఆర్

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్‌పేట్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పేగులు తెగదాకా కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు.. కుర్‌కురే బీజేపీ పార్టీ ఒక దిక్కు, కిరికిరి కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయి అని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కుర్‌కురే పార్టీకి.. కిరికిరి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పండి.. జూన్ 2 తర్వాత బీజేపోళ్లు ఖచ్చితంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు. హైదరాబాద్ మీద వాళ్లకు పట్టుదొరుకతలేదు.. అందుకే ఢిల్లీని చేసినట్లు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తున్నారు.. దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్‌లో ఖచ్చితంగా ఉండాలే అని అన్నారు.

ఇవి ప్రధాని ఎన్నికలు కాదా? బీఆర్ఎస్ గెలుసుడు ఏమీ అవసరమని కొందరంటున్నారు.. గతంలో కూడా ఇట్లనే మాట్లాడారు.. కానీ ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు..ఢిల్లీ మెడలు, కాంగ్రెస్ మెడలు వంచేది కేసీఆర్ గారు మాత్రమే.. తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.

ఐదేళ్లలో కిషన్ రెడ్డి అంబర్‌పేట్‌కు ఒక్క రూపాయ్ తెచ్చిండా? ఒక్క గుడి కట్టిండా, బడి కట్టిండా? ఎందుకు ఓటు వేయాలె.. ఈసారి బీజేపీ 400 సీట్లు అంటోంది.. మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్, డిజీల్ రూ. 400 అయితది.. సిలిండర్‌ను రూ. 5 వేలు చేస్తారు అని దుయ్యబట్టారు.

మీకు ఓటు ఎందుకు వేయాలంటే మేము గుడి కట్టినం అంటారు. మరి కేసీఆర్ గారు యాదాద్రి కట్టలేదా? ఒక్క యాదాద్రి మాత్రమే కాదు.. ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం సహా ఎన్నో రిజర్వాయర్లు కట్టిండు. గుడి కట్టుడే కారణమైతే కేసీఆర్ గారిని ఎన్ని ఓట్లు వేయాలే అని కేటీఆర్ అడిగారు.

సికింద్రాబాద్‌లో బీజేపోళ్లే కిషన్ రెడ్డి హటావో.. సికింద్రాబాద్ బచావో అంటున్నారు..2014, 2018లో బీజేపోళ్లను ఓడించింది బీఆర్ఎస్సే. 2023లో కూడా బీజేపీ తీస్మార్ ఖాన్లు అని చెప్పుకునేటోళ్లను కూడా బీఆర్ఎస్సే ఓడించింది అని గుర్తు చేశారు.

కాంగ్రెసోళ్లు సిగ్గులేకుండా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నారు. మా చెల్లెలు, కేసీఆర్ గారి కుమార్తె 50 రోజులుగా జైల్లో ఉంది.. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే మా చెల్లెలు జైల్లో ఉండేదా? అని ప్రశ్నించారు.

2014లో బడే భాయ్.. 2023లో చోటా భాయ్ మోసం చేసిండు.. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్మి మోసపోయారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలైనయ్ అంటూ హోర్డింగ్‌లు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.

లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నావ్.. ఇయ్యకపోతే నీ లగ్గం చేస్తారు ఆడబిడ్డలు. రూ. 2,500 మహిళలకు ఇచ్చినమని రాహుల్ గాంధీ చెబుతుండు.. మరి వచ్చినయా? వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు వచ్చినయా? ఉన్న 2 వేలు కూడా ఎగ్గొట్టిండు అని కేటీఆర్ అన్నారు

రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే టీవీల ముందు ఫ్యామిలీతో చూసే పరిస్థితి లేదు.. నేను లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అంటాడు.. దొంగలు కదా తిరిగేది? గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు.. మెడల పేగులు వేసుకుంటా అంటాడు.. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు.. ముఖ్యమంత్రి జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతాడా? అని అడిగారు

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతా.. మీరు చేయాల్సిదల్లా ఒక్కటే.. 13 మే నాడు కారు గుర్తు మీద ఓటు వేయండి. 10-12 సీట్లు మాకు అప్పగించండి.. 6 నెలల్లోనే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని పేర్కొన్నారు.

సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి మనమే గెలుస్తున్నాం.. పజ్జన్నకు అంబర్‌పేట్‌లో 50 వేల మెజార్టీ రావాలె.. 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే పజ్జన్న గారి గెలిపించండి అని పిలుపునిచ్చారు.