ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరి ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను అందించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేటీఆర్ కోరారు. లక్డికాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని మరొక ప్రతిపాదనను కేటీఆర్ సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్ మరియు లింకు రోడ్డుల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేటీఆర్ తెలిపారు. అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు 2400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.