బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానని వాళ్ల కుటుంబానికి హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు సోమిరెడ్డి పద్మ-చంద్రం దంపతుల కూతురు దీప్తి ఇటీవలే తనకు ఐఐటీ గౌహతిలో డేటా సైన్స్ అండ్ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీటు వచ్చింది. కానీ ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదివేందుకు కావాల్సినంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీప్తి కుటుంబ సభ్యులు దాతల నుంచి ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు.
ఈ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఐఐటీ లాంటి ప్రతిష్మాత్మక విద్యాసంస్థలో సీటు రావటమంటే చాలా గొప్ప విషయమని విద్యార్థిని దీప్తిని ప్రశంసించారు. బర్త్ డే సందర్భంగా కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన దీప్తి కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
దీప్తి నాలుగేళ్ల కోర్సు పూర్తి చేయటానికి కావాల్సిన మొత్తం ఖర్చు భరిస్తానని చెప్పారు. దీంతో దీప్తి తో పాటు ఆమె తల్లితండ్రులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దీప్తికి లాప్‌టాప్‌ను కూడా బహుకరించారు. చదువు పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరాలని ఈ సందర్భంగా దీప్తిని కేటీఆర్ కోరారు.