తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి చెందిన విద్యార్థి శైలజ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని అన్నారు.
ప్రభుత్వమే తల్లితండ్రి అయి చూసుకుటుందని పిల్లల తల్లితండ్రులు గురుకులాలకు పంపిస్తే.. 48 మంది పేద పిల్లలను పొట్టనబెట్టుకున్నారు. ఇవి మామూలు మరణాలు కాదు. ప్రభుత్వం చేయించిన హత్యలుగానే భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
నా నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట్లో ఓ విద్యార్థి గురుకుల పాఠశాలలో చనిపోతే ఆకుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఆ తల్లితండ్రులు తమలాంటి కడపుకోత వేరే వారికి రాకుండా పోరాడాలని కోరారు. మేము ఆనాటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ.. గురుకులాల విద్యార్థుల అంశాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు అని విమర్శించారు.
ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం. ఆ కుటుంబాల తరఫున శాసన సభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం. కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నిబ్బరంగా ఉండండి. ఆరోగ్యం బాగాలేకపోతే మేము చూసుకుంటాం.. బీఆర్ఎస్ను సంప్రదించండి అని తెలిపారు.
ముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించింది. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కావాల్సినంత దోపీడి జరుగుతుంది. ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థంకావటం లేదు అని కేటీఆర్ అన్నారు.
నిన్న ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడును చిప్ దొబ్బినట్లు అనిపించింది. మేము అదానీకి ప్రాజెక్ట్‌లు ఇచ్చామంటాడు. ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లు మేము ఇచ్చామంటాడు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నువ్వు చెప్పే వాటిని ప్రజలు నమ్మరు. మీడియా ఎవ్వరూ కూడా నమ్మరు అని ఎద్దేవా చేశారు.
రక్షణ శాఖకు ఇచ్చిన ప్రాజెక్ట్‌లు మేము ఇచ్చామంటాడు. రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా? మరీ రాజ్‌నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నట్లు? విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలి. ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలి అని కోరారు.
డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్లు చూపించారు. చిట్టి నాయుడుకు ఏమీ తెలియదు. ఎవరన్న చెప్పిన వినడు. ఆయన మూర్ఖుడు. మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు.. రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడు. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశాడు అని దుయ్యబట్టారు.
నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుంది. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలయ్యావ్. మైక్రోసాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చింది. ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చాం. నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్‌లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్లో పెట్టాను. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు, కోహినూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. నాకు నీ లాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదు. ఏదీ చేసిన బజాప్తా చేస్తా అని పేర్కొన్నారు.
అదానీ మేము అసలు ఎంకరేజే చేయలేదు.. నీ లెక్క లుచ్చా పనులు చేసే.. ఆయన కాళ్లు ఒత్తుకుంటా ఉండే అలవాటు నాది కాదు. ఫస్ట్రేషన్లో నన్ను తిడున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడది. ప్రశ్నిస్తే నేను సైకోనా? కొండారెడ్డిపల్లిలో నీకోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరీ నువ్వు శాడిస్ట్‌వా? అసలు నీకోసం పనిచేసిన పెద్ద మనిషి ఆత్మహత్యకు కారణమైన నువ్వు మనిషివేనా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
శైలజ అనే విద్యార్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు మా పార్టీ నేత కోవా లక్ష్మి గారు వెళ్తా ఉంటే ఆమె హౌజ్ అరెస్ట్ చేశారు. అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. వాళ్లు పోతే నీకు ఏమైందయ్యా.. ఇంటర్నెట్ షట్ డౌన్, అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలు ఇదే ప్రజా పాలనా? ఏడాది నీ పాలనలో అదానీ, అల్లుడు, అన్న, బావ మరది సృజన్ రెడ్డికి అమృతం పంచటం కోసం తప్పా.. నువ్వు పీకిందేంటీ? అని ప్రశ్నించారు.
అసలు అదానీ చెక్ ఇచ్చి 38 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు క్యాష్ చేయలేదు.. అంటే చెక్ చూపించి వెనక నుంచి ఆ డబ్బులు దొబ్బేసే కుట్ర చేస్తున్నారు. అదానీ ఫ్రాడ్ అని రేవంత్ రెడ్డికి నిన్ననే తెలిసిందా? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ ఇక్కడ సుద్దపూస అయ్యిండా? ఆయన చెక్ ఇవ్వలేదు. అది క్యాష్ కాలేదు. ఏదో తమాషా చేసిండు అని అన్నారు.
అదానీతో రూ. 12,440 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. అందులో పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంట. అసలు తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ పాలసీ ఉందా? ముఖ్యమంత్రి చెప్పిన వాటిల్లోనే రెండు అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ పాలసీ లేదు. అదే విధంగా కొడంగల్‌లో అల్లుడు కోసం అనుకున్నాం. కానీ ఇప్పుడు అదానీ కోసం తెలిసింది. రామన్నపేటలో సిమెంట్ ప్రజలు వద్దన్నప్పటికి పెడుతూ మూసీని కలుషితం చేస్తారంట. మళ్లీ కొడంగల్‌లో కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతారంట. నేను ప్రశ్నిస్తే సైకోనా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెడితే మరి నువ్వు దొంగవా? అని అడిగారు.
అదానీ రాష్ట్రం వదిలి వెళ్లాడు అని సీఎం అనుంగ పేపర్లోనే వార్త వచ్చింది. ఏదో నిన్న రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిట్లు తిట్టటంతో అట్ల యాక్షన్ చేశారు. అదానీ వ్యవహారానికి సంబంధించి రెండేళ్ల కిందటే హిండెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చింది. రాహుల్ గాంధీ ఏమో అదానీ దొంగ అని అంటుంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో రూ. 12,400 కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడు. ముఖ్యమంత్రి ఇంటి పేరును అనుముల కాదు.. అబద్ధాల రేవంత్ అని మార్చుకోవాలి అని సూచించారు.
కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్‌లను మేము ఇచ్చామంటూ చెబుతున్నావ్ నీకు ఏమైనా పరిజ్ఞానం ఉందా? కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండని ఆయనను తిడుతున్నావ్. అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వటమే కేసీఆర్ గారు చేసిన తప్పా? బొగ్గు పాలసీని విషయంలో దేశంలో కేంద్రాన్ని నిలదీసిన ఒకే ఒక్కడు కేసీఆర్. నీలాగా కాళ్లు పట్టుకోవటం, లుచ్చా పనులు చేయటం, మస్కా కొట్టటం, గౌతమ్ భాయ్ అంటూ చుట్టూ తిరిగే రకం మేము కాదు అని తెలిపారు.
రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిట్లు తిడితే డ్యామేజ్ కంట్రోల్ కోసం మొత్తానికి వెనక్కి తగ్గావ్. బీఆర్ఎస్ దెబ్బకు గత్యంతరం లేక పీచేముడ్ అన్నందుకు సంతోషం. కానీ అదానీతో మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిన్ను, నీ రాహుల్ గాంధీని ప్రజలు నమ్ముతారు. మూసీ ప్రాజెక్ట్‌ను కూడా ఏ పాలసీ లేకుండా ఏ విధంగా ఇస్తారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి. ఏం చేస్తావో చేసుకో. నీకు భయపడేవాళ్ల కాదు మేము అని స్పష్టం చేశారు.
మీడియా మిత్రుడు ఒకరు నిన్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టాలని హైద్రాబాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తే.. ఎవడో పుల్లయ్య, మల్లయ్య చెప్పిండు అంటాడు.ఎల్లయ్య, మల్లయ్య చెప్పలేదు. ప్రభుత్వంలోని నీ శాఖనే చెప్పిందన్న సోయి కూడా లేదు. ముఖ్యమంత్రికి అంతా కన్ఫ్యూజనే. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తుంటే మీడియా ఆ ట్రాప్‌లో పడవద్దు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి శృతి ఉందా? ఆయన పిచ్చోడా, ఈయన పిచ్చోడా? తేల్చుకోవాలి అని అన్నారు.
అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ప్రపంచం మొత్తం తిరిగి చెబుతాడు. రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే మంచిదే. 28 సార్లు ఢిల్లీకి పోయి రూ. 28 కూడా తేలేదు. నువ్వు పెద్ద బృందంతో వెళ్లి పెట్టిన ఖర్చు కూడా పడ్తల్ కాకపోతే ఎట్లా? బీజేపీతో చీకటి ఒప్పందం, రాహుల్ గాంధీని కలిసి ఆయనకు మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకోవటానికే నువ్వు ఢిల్లీకి వెళ్లేది. అంతే తప్ప ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి పోతలేడు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు