mt_logo

ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు: కేటీఆర్

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.

మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడు.. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు అని విమర్శించారు.

గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టింది.. ఢిల్లీకి డబ్బు సంచులు పంపడంపైన దృష్టి పెట్టారు. గత పది సంవత్సరాలలో మా ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏరోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదు.. మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి రూ. 38 వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం అని గుర్తు చేశారు.

50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం.. కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌లో ట్యాంకర్ల హడావిడి మొదలైంది అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయింది.. మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రకృతి వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు.. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత అని కేటీఆర్ పేర్కొన్నారు.

గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చింది.. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి.. ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్‌పైన దృష్టి పెట్టండి అని సూచించారు.

సాగర్‌లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్‌లో, ఉస్మాన్ సాగర్‌లో నీళ్లు ఉన్నా.. ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి.. తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. సంవత్సరం పాటు నగర జనాభా అవసరాలకు అవసరమైన నీళ్లు నాగార్జునసాగర్‌లో ఉన్నా.. హైదరాబాద్ నగరంలో ఇంత తీవ్ర నీటి కొరత ఎందుకు ఉన్నది? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజల తాగునీరు తీసుకోవాలి అంటే ఢిల్లీ ముందు బిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.. మా ప్రభుత్వం డిజైన్ చేసిన సుంకిశాల ప్రాజెక్టు 75% పూర్తయింది.. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టడంతో అది పూర్తి కాలేదు అని తెలిపారు

కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతోని కాళేశ్వరంని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసింది.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్.. నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారు.. ఇన్ని రోజులు ఆ నీళ్లు ఎక్కడ పోయినయి.. ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినమని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నీటిని ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలి అని అడిగారు.

కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా దాచి పెట్టడం వల్లనే లక్షల ఎకరాల పంట ఎండింది.. ఈ మూడు నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసి పంపులు ఆన్ చేసి ఉంటే ఒక్క ఎకరం పంట కూడా ఎండకపోయేది.. నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలన్న దుర్మార్గపూరిత ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది.. పంట పండితే బోనస్ ఇవ్వాలా అన్న భయంతోనే పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

హైదరాబాద్ నగరం కాంగ్రెస్‌కి ఓటు వేయలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి నగరం పైన కక్ష కట్టారు.. అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న తాగునీరు అందియడం లేదు. 12 గంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి.. అసలు ట్యాంకర్లతోని నీరు ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని చెప్పాలి ఆని ప్రశ్నించారు.

గతంలో కన్నా రెట్టింపు ట్యాంకర్లు నగరంలో నడుస్తున్నాయి.. ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. వీటి ద్వారా ప్రజలపై పడుతున్న భారం కాంగ్రెస్ పార్టీ వేసిందే కదా.. రేవంత్ రెడ్డి ఈ భారం భరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా చెప్పాలి అని కేటీఆర్ అడిగారు.

బెంగళూరు మాదిరి నీటిని వాడితే జరిమానాలు విధించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుంది. నీటిని వృథా చేసినందుకు జరిమానా వేస్తే నీటిని ఎత్తిపోయకుండా గొంతులు ఎండబెట్టిన రేవంత్ రెడ్డిపైన ఎన్ని జరిమానాలు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి అని కోరారు.

తాగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా.. అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తాం. గతంలో మేము 20,000 లీటర్ల ఉచిత నీటిని 12 లక్షల కుటుంబాలకు అందించాం అని గుర్తు చేశారు.

ఇప్పుడు గత ఏడాది డబ్బులు అన్ని కూడా ఒకేసారి ఇచ్చి ప్రజల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది.. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు.

రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్ రెడ్డికి నేరుగా పంపిస్తాం. అన్ని వివరాలు మేము ఇచ్చాక.. ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కింద ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు..గతంలో రేవంత్ రెడ్డి రైతులు చనిపోయినందుకు ఇచ్చే ఆర్థిక సాయం ఎందుకు అన్నారు. రైతులు చావకుండా చూడాలన్నారు కానీ రేవంత్ రెడ్డి ఈరోజు మాటే మార్చి మాట్లాడుతున్నారు అని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదు. గతంలో తెలంగాణ ఎంపీల ఫోన్ ట్యాపింగు చేశారని.. ఈరోజు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు..మీ వదిన ఆరోపణలు చేసిన వాటి పైన కూడా రేవంత్ రెడ్డి విచారణ చేయించాలి అని తెలిపారు.

అధికారులు మారలేదు ప్రభుత్వమే మారింది.. ఆనాడు ఉన్నా శివధర్ రెడ్డి.. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డిలు, రవి గుప్తా లాంటి అధికారులే ఈరోజు ఉన్నారు. ఈ అధికారులు ఎవరూ కూడా బాధ్యులు కారా.. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగే ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపైన విచారణ చేపట్టాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి పక్కన ఉన్న పొన్నం ప్రభాకర్ గతంలో చేసిన విమర్శలపైన సమాధానం చెప్పాలి. గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్‌లో ఉందని నాకు మెసేజ్ వస్తే నేను ప్రజలతో పంచుకున్నాను.. ఎవరి ఫోన్లు ట్యాప్ అయినయ్.. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి. ట్యాపింగ్‌పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది అని పేర్కొన్నారు.

ప్రతిసారి మొగోడివైతే మొగోడివైతే అని మాట్లాడుతావు కదా.. మరి నువ్వు నిజంగానే మోగోడివైతే రుణమాఫీ చేయ్ అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.