mt_logo

బీజేపీ అభ్యర్థి డాలర్ బిళ్ళ.. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లని గవ్వ!

ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుతో కలిసి మంగళవారం హన్మకొండ తారా గార్డెన్ లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జయశంకర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో, సుధానగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి అమెరికా నుండి, కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్ నుండి దిగుమతి అయ్యారు.. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం పక్కా లోకల్ అని చెప్పారు. ప్రజా సమస్యలు తెలియని వీరితో వరంగల్ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక చిరిగిన రూపాయి నోటు చూపిస్తూ ఇది హైదరాబాద్ లో చెల్లలేదని, దీన్ని వరంగల్ కు తీసుకొస్తే ఇక్కడా చెల్లలేదని, స్థానికేతరులకు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు.

బీజేపీ అభ్యర్థి డాలర్ బిళ్ళ.. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లని గవ్వ అని, హైదరాబాద్ మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి వరంగల్ లో ఎట్లా గెలుస్తాడని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి డాలర్ బిళ్ళని, ఆ డాలర్ ఇక్కడ చెల్లదని, అసలు సిసలైన రూపాయి బిళ్ళ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ఇంటింటికీ నీళ్ళివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన మొనగాడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పని చేసేటోని కాళ్ళ మధ్య కట్టె పెట్టడం తప్ప తెలంగాణను అభివృద్ధి చేయాలనే సోయి కాంగ్రెస్, బీజేపీలకు లేదని, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారంగా ఉంటుందని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అంధకారంలో ఉన్నాడని, తెలంగాణ మాత్రం దేదీప్యమానంగా వెలుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉద్యమం నుండి పుట్టిందే తెలంగాణ మజ్దూర్ యూనియన్ అని, కార్మికులు రాష్ట్ర సాధనలో నిర్వహించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. చరిత్రలోనే అడిగిన దానికంటే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని, రవాణా శాఖామంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు కార్మికుల కష్టాలు ఏమిటో తెలుసని హరీష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలియని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని హరీష్ రావు కార్మికులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *