లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది? అని అడిగారు.
సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? లేక లగచర్ల చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా? పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కొడంగల్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు అని దుయ్యబట్టారు.
మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదు. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో మీ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే.. కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క అని పేర్కొన్నారు.
మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలి. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.