- తెలంగాణ రాష్ట్రంలో 1200 కోట్ల తన తయారీ కేంద్రానికి కిటెక్స్ శంకుస్థాపన
- శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భారీ తయారీ యూనిట్ కు కిటెక్స్ సంస్థ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ లో కిటెక్స్ సంస్థ తన ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారెల్ తయారీ క్లస్టర్ కోసం ఈరోజు మంత్రి కె. తారక రామారావు,కిటెక్స్ సంస్థ చైర్మన్ జేకబ్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.కిటెక్స్ సంస్థ తన తయారీ క్లస్టర్ కోసం 1200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నది. ఈ క్లస్టర్ ఏర్పాటు తర్వాత ప్రతిరోజు ఏడు లక్షల దుస్తులను కిటెక్స్ సంస్ధ ఉత్పత్తి చేయనున్నది. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తి అవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కిటెక్స్ సంస్థ తెలిపింది.
కిటెక్స్ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తన భారీ తయారి యూనిట్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి వరంగల్ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు కిటెక్స్ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.. తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కిటెక్స్ సంస్థకి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
కిటెక్స్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కిటెక్స్ సంస్ధ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.