mt_logo

తెలంగాణ ప్రగతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు: టైకాన్ కేరళ సదస్సులో కేటీఆర్

పదేళ్ల తెలంగాణ ప్రగతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన టైకాన్ (TiE Con) కేరళ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పారిశ్రామిక విధానాలు, సాధించిన ప్రగతి, తెలంగాణ అనుభవాలను కేటీఆర్ వివరించారు.

సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ఆకాంక్షలతో కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత ఉపాధి కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పని చేయాలని నిర్ణయించుకున్నం.. హైదరాబాద్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు అదనపు హంగులు అద్దెలా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాము అని గుర్తు చేశారు.

సిలికాన్ వ్యాలీ మాదిరి ఒకవైపు సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తూనే ఇన్నోవేషన్ రంగం బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించడం జరిగింది. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఐఎస్బీ, నల్సార్, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలను భాగస్వాములు చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ ఏర్పాటు చేశాం అని తెలిపారు.

అనేక ఆలోచనలు ఉండి వాటి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తెలియని యువతకి, ఔత్సాహికులకు టీ హబ్ మార్గదర్శిగా నిలిచింది. వీటితోపాటు మేము ఏర్పాటు చేసిన వీ హబ్, టీ హబ్, టీ వర్క్స్, త్వరలో అందుబాటులోకి రానున్న ఇమేజ్ టవర్ వంటి వాటి ద్వారా హైదరాబాద్ భారత దేశ ఇన్నోవేషన్ స్టాటప్ ఈకోసిస్టంలో అగ్రశ్రేణి నిలిచింది అని కేటీఆర్ అన్నారు.

తైవాన్ వంటి చిన్న దేశంతో పాటు పెద్ద దేశమైన చైనా ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాల్లో అద్భుతంగా ముందుకు పోతున్నప్పుడు భారతదేశం ఎందుకు పోలేదనే విషయంపైన ప్రభుత్వాలు ఆలోచించి తగిన విధానాలను రూపకల్పన చేయాలి అని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం అనేక ఆర్థిక సూచీలలో అగ్రస్థానంలో నిలిచింది ముఖ్యంగా తలసరి ఆదాయంతో పాటు స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి జిఎస్డిపి వంటి వాటిలో వేగంగా ముందుకు పోయింది. వీటి కోసం మా అధినేత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన కృషి ప్రధాన కారణంగా చెప్పగలము అని అన్నారు.

విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, సాగునీటి రంగం బలోపేతం వంటి ప్రాథమికమైన సమస్యలను పరిష్కరించే దిశగా విప్లవాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశాము. మిషన్ భగీరథ వంటి అతిపెద్ద తాగునీటి ప్రాజెక్టుతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేశాము అని పేర్కొన్నారు.

కేరళ రాష్ట్రం ప్రముఖ కంపెనీ కిటెక్స్ గ్రూప్ కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్న సమాచారం తెలుసుకొని వేగంగా ఫాలోఅప్ చేయడం వలన వేలకోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకి కిటెక్స్ రూపంలో వచ్చాయి అని తెలిపారు. కిటెక్స్ పెట్టుబడుల కోసం ఒక్కరోజులోనే సంస్థ చైర్మన్ కలిసి, ఆయన కోసం ప్రత్యేక విమానాన్ని పంపించి తెలంగాణ రాష్ట్రానికి రప్పించి, ఇక్కడి పారిశ్రామిక విధానాలను వివరించి తెలంగాణకు రప్పించగలిగాము అని కేటీఆర్ అన్నారు.

త్వరలోనే కిటెక్స్ కార్యకలాపాలు తెలంగాణలో ప్రారంభం కాబోతున్నాయి. రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఇతర దేశాలకు పోకుండా తెలంగాణకు రప్పించగలగడం అత్యంత సంతృప్తిని ఇచ్చింది. కేరళ వంటి రాష్ట్రాలు సైతం తెలంగాణ విధానాల నుంచి నేర్చుకొని ముందుకు పోవచ్చని కేటీఆర్ సూచించారు.

కేవలం తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల పారిశ్రామిక విధానాలను పరిశీలించి వాటిలోని అద్భుతమైన అంశాలను స్వీకరిస్తే సరిపోతుందన్నారు. వీటితోపాటు ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు అవసరాలను ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పాలసీలను రూపొందిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నారు.

ఇదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలు, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారిత టీఎస్ఐపాస్ తెలంగాణ ఐటి పాలసీ అనేక ఇతర పాలసీలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ముందుకు తీసుకుపోయాము. టీఎస్ ఐపాస్ విధానం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగాను అనేక ప్రశంసలను అందుకున్నది అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళ పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు గతంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాము. మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్ ఏర్పాటు చేయడం, తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాము. దానికి ఒక మహిళను సీఈవోగా నియమించాము అని అన్నారు.

వీటితోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాం. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలతో పాటు విద్య అనంతరం ఉపాధి అవకాశాలను పెంచేందుకు వారిని పరిశ్రమలకు కంపెనీలకు అవసరమైన తీరుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అని పేర్కొన్నారు.

అందుకే గత పది సంవత్సరాలలో మా ప్రభుత్వం టాస్క్ వంటి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమలకు యూనివర్సిటీలకు ఉన్నత విద్య సంస్థలకు మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. యువత అపజయాలకు కృంగిపోవల్సిన అవసరం లేదని ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకొని గెలుపు వైపు మరింత స్పూర్తితో ముందుకు పోయినప్పుడే జీవితంలో ఉన్నత విజయాలు సాధ్యమవుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.