mt_logo

ప్రజలపై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి: కేటీఆర్

విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నాం. పారిశ్రామికవేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి అని గుర్తు చేశారు.

మా సిరిసిల్లలో కూడా పవర్‌లూమ్ పరిశ్రమ కరెంట్‌తోనే ముడి పడి ఉంది. ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్‌తో విడదీయరాని సంబంధం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు స్వర్ణయుగంగా మారింది అని తెలిపారు.

కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాలకులకు విజన్ ఉంటే.. సంపద పెంచి.. పేదలకు పంచాలి.. కానీ.. ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం మోపి.. సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గం అని మండిపడ్డారు.

డిస్కమ్లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే. ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రం. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదు. అది ప్రభుత్వ బాధ్యత. అదనపు ఆదాయం కోసం రూ 18 వేల కోట్ల అదనపు భారం మోపాలన్న కాంగ్రెస్ సర్కారు ఆలోచనే ప్రజా వ్యతిరేకమైనది అని విమర్శించారు.

విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ఛార్జీలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కోరుతున్నా. వివిధ కారణాలు చెప్పిన రూ. 963 కోట్లు ట్రూఅప్ ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 1200 కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

కేసీఆర్ గారు అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ఉచితంగా నీళ్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి భారం వేయలేదు. మా సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్‌పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 10 హెచ్‌పీలను 30 హెచ్‌పీల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నానన్నారు.

ఇళ్లకు 300 యూనిట్లకు దాటితే ప్రస్తుతం ఉన్న రూ. 10 ఫిక్స్‌డ్ ఛార్జీలను 50 కి పెంచాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒక్క సెస్ పరిధిలోనే తీసుకుంటే లక్షా 20 వేలకు పైగా కనెక్షన్లు ఉంటే 75 వేల కనెక్షన్ల వరకు ఎండకాలంలో 300 యూనిట్లకు పైగా వాడుతున్నారు. కరెంట్ వినియోగమనేది గతంతో పోల్చితే చాలా వరకు పెరిగింది. ఇప్పుడు డిస్కంలు చేసిన ప్రతిపాదన ఏదైనా ఉందో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.

11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీలోకి తేవటమనేది అసంబద్ధం. అదానీ ఒక ఫ్యాక్టరీ పెడితే వారికి వర్తించే కేటగిరీనే మా సిరిసిల్లలో సాంచాలు నడిపే పరిశ్రమకు ఉంచాలనుకోవటం హేతుబద్ధమైన నిర్ణయం కాదు. పరిశ్రమలకు సంబంధించి కరెంట్‌ను అన్నింటిని ఒకే గాటున కట్టటమంటే సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లే. ఈ విధమైన కుట్ర చేస్తూ చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రలు బేంబేలెత్తేపోతాయి. కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలను మనం కాపాడుకోవాల్సిన అవసరముంది. డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మేము 12 వందల కోట్లు భరించాం. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదు? అని అడిగారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన మేము అందుకు అంగీకరించలేదు. 10 హెచ్‌పీ వరకు సిరిసిల్ల నేతన్నలకు సబ్సిడీ ఇచ్చాం. నాయిబ్రహ్మణులు, రజకులకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేశాం. పదేళ్లు మేము ఛార్జీలు పెంచలేదు. ఇప్పుడు పది నెలలకే ఎందుకు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు.

కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయం. ఈఆర్సీ ఛైర్మన్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు.

విద్యుత్ వ్యాపార వస్తువుగా చూడవద్దని.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా భావించాలని కోరుతున్నాను. నా నియోజకవర్గంలోని సెస్ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ..దేశంలో సహకారం రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్ సంస్థల్లో సెస్ ఒక్కటి. మా నేతృత్వంలోని ఇక్కడి సెస్ పాలకవర్గం బ్రహ్మండంగా పనిచేస్తోంది. డిస్కంలతో పోల్చితే మా సెస్ పనితీరు 100 శాతం మెరుగు అని నేను గర్వంగా చెబుతున్నాను అని పేర్కొన్నారు.

గతంలో సెస్‌ను రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థల్లో కలపాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రాంత వాసులు వ్యతిరేకించారు. వ్యవసాయ విద్యుత్‌ను 5 నుంచి 7.5 హెచ్‌పీకి పెంచాలి. 7.5 హెచ్‌పీకి సబ్సిడీ ఇవ్వాలి. గతంలో ఎన్పీసీడీఎల్ సగటు ధర నిర్ణయించేది. కానీ ఆ తర్వాత బల్క్ సప్లయ్ టారిఫ్ ఆధారంగా నిర్ణయిస్తోంది. సర్‌ఛార్జీ కూడా అమలు చేస్తున్నారు అని అన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గౌరవ కమిషన్ సెస్ కొనుగోలు చేసే విద్యుత్‌ను 965.26 MUగా నిర్ధారించారు. కానీ వాస్తవానికి 2023-2024 సంవత్సరానికి సెస్ కొనుగోలు చేసిన విద్యుత్ 1133.52 MUలు అంటే.. 168.26 MUలు అదనం. అదనపు యూనిట్లు ఖర్చు ప్రభుత్వమే భరించాలి. సెస్‌ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.

పరిపుష్టమైన సబ్సిడీ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం నుంచి సంస్థకు వచ్చే విధంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేతన్నల సమస్యలు తెలిసిన వ్యక్తిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు

సిరిసిల్లలో నేతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్ ఇక్కడి నేతన్నలకు ఇచ్చాం. వర్కర్ టూ ఓనర్ పథకం కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. అపారెల్, టెక్స్‌టైల్ పార్క్‌లను బలోపేతం చేశాం. మరమగ్గాలను మోడ్రనైజేషన్ చేశాం. గత పదేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో 10 హెచ్‌పీల వరకు మాత్రమే సబ్సిడీ ఉంది. దాన్ని 30 హెచ్‌పీ వరకు పెంచాలి..సిరిసిల్లను మరో తిరుపూర్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదు. వారికి ఆర్డర్లు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.. మానవీయ కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్న 10 హెచ్‌పీ సబ్సిడీని 30 హెచ్‌పీలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.

మొత్తంగా ప్రజలపై రూ. 18 వేల కోట్ల భారాన్ని మోపాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నా. అదే విధంగా డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేస్తున్నా..సెస్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరపున సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.