mt_logo

ఊసరవెల్లి రంగులు మారుస్తది.. రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తడు: నిర్మల్‌లో కేటీఆర్

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంత కష్టమొచ్చినా సరే మేము బీజేపీ ముందు తలవంచం. పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. ఎట్టి పరిస్థితుల్లో మోడీకి భయపడి తలవంచం అని తేల్చి చెప్పారు.

బేవకూఫ్ కాంగ్రెస్ గాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని ప్రచారం చేస్తున్నారు. నిజంగా బీజేపీతో దోస్తీ ఉంటే మా చెల్లెలు 50 రోజులుగా జైల్లో ఉండేదా? పార్లమెంట్ ఎన్నికలు కదా? ఎందుకు బీఆర్ఎస్‌ను గెలిపించాలని కొందరు అడుగుతున్నారు.. కానీ 2014, 2018 రాష్ట్రంలో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సే. 2014, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సే. 2023లో కూడా బీజేపీ తీస్మార్ ఖాన్‌లను ఓడించింది కూడా బీఆర్ఎస్సే.. బీజేపీని ఎదుర్కోలేక రాహుల్ గాంధీ పారిపోయిండు.. కేసీఆర్ మాత్రమే బీజేపీని ఎదుర్కొనేది అని స్పష్టం చేశారు.

2014లో నమో వచ్చాడు.. నమో అంటే నరేంద్రమోడీ కాదు.. నమ్మించి మోసం చేసే వ్యక్తి. నల్లధనం తెస్తా, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ రైళ్లు, ఇళ్లు లేనోళ్లకు ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా అన్నాడు. మరి కాలా ధన్ ఏదీ మోడీ అంటే.. తెల్లమొఖం వేస్తున్నాడు. ఐదేళ్లలో బీజేపీ ఎంపీ ఈ ప్రాంతానికి ఏం చేసిండు.. మళ్లీ వాళ్లకు ఓటేద్దామా? అని అడిగారు

ఏమైనా అంటే గుడికట్టినం అని బీజేపోళ్లు అంటారు. గుడికట్టినందుకే ఓటు వేయాలంటే కేసీఆర్ గారు కట్టలేదా యాదాద్రి. గుడి మాత్రమే కాదు.. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్ట్.లు కూడా కట్టిండు కేసీఆర్.. ఎస్సారెస్పీకి కూడా పునరుజ్జీవం చేసిందే కేసీఆర్. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుడు గొప్ప పని కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

పదేళ్లలో యువత మనసులో విషం నింపటం తప్ప.. మోడీ ఏం పీకిండు? ఏమన్నా అంటే మతం, హిందూ-ముస్లిం ఇదే పంచాయితీ. మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలె.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఖచ్చితంగా అది బీజేపీకే వెళ్తుంది. రిజర్వేషన్లు రద్దు చేస్తా.. రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని మోడీ అంటున్నారు అని తెలిపారు.

కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్ల ఉంది మన పరిస్థితి.. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించిండు.. మోచేతికి బెల్లం పెట్టిండు. రైతుభరోసా, కౌలు రైతులు, రైతు కూలీలలకు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 కే రూ. 2 లక్షల రుణమాఫీ అన్నాడు.. కానీ ఐదు నెలలు గడిచిన రుణమాఫీ కాలేదు.. ఊళ్లల్లో కరెంట్ ఉంటుందా? కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాల్నా అని అప్పుడే అన్నాం అని గుర్తు చేశారు.

కొంతమంది కాంగ్రెస్ హామీలు నమ్మి వాళ్లకు ఓటు వేసి మోసపోయామని బాధపడుతున్నారు. మహిళలకు రూ. 2,500 వచ్చియా? తులం బంగారం వచ్చిందా? రేవంత్ రెడ్డి లక్షన్నర తులాల బంగారం ఆడపిల్లలకు బాకీ ఉన్నాడు. పెద్దమనుషులు ఇద్దరికీ రూ. 4 వేలు ఇస్తా అన్నాడు.. ఏమైనా వచ్చాయా? మనం ఇచ్చిన కరెంట్.. నీళ్లు కూడా ఇచ్చుడు చేతనైతలే. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు.. రెండోసారి మోసపోతే మనదే తప్పు.. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది.. రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తుండు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఈ ముఖ్యమంత్రికి ఆలోచన లేదు.. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఫ్రీ బస్సు పెట్టిండు.. మహిళలు కొట్టుకునే పరిస్థితి తెచ్చిండు.. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేసిండు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. లంకె బిందెల కోసం వెతికేది దొంగలు కదా? మెడల పేగులు వేసుకుంటా అంటాడు.. జేబుల కత్తెర పెట్టుకుంటా అంటాడు. ఇంత చిల్లరగాడు మన ముఖ్యమంత్రి కావటం మన ఖర్మ అని అన్నారు.

ఈ ముఖ్యమంత్రితో నీళ్లు, కరెంట్ ఇచ్చుడు ఏదీ చేతకాదు. మొత్తం బోగస్ ముచ్చట్లు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు.. ఒక్క హమీని కూడా నెరవేర్చడు.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటే జిల్లా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. నిర్మల్ జిల్లా ఉండాలన్నా.. ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలన్నా మళ్లీ బీఆర్ఎస్ గెలవాలె అని కోరారు.

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.. మే 13 నాడు మాకు 10-12 ఎంపీలను అప్పగించండి.. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. మనతో పాటు పదేళ్లు మంత్రి పదవిలో ఉండే ఒకాయన.. ఇప్పుడు వెళ్లిపోయిండు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండేటోడే లీడర్. పారిపోయేటోడు మనకు ఎందుకు? మనల్ని విడిచిపెట్టి, సిగ్గు విడిచిపెట్టి పోయినోళ్లు మళ్లీ మన దగ్గరకే వస్తారు. దండం పెట్టినా.. ఏం చేసిన సరే వాళ్లను మళ్లీ పార్టీలోకి రానియ్యం అని తేల్చి చెప్పారు.

మీకు నిర్మల్‌లో ఏం కోపం వచ్చిందో మమ్మల్ని ఓడించారు. మరి బీజేపీని గెలిపిస్తే ఏం చేశారు.. బీజేపీ, కాంగ్రెస్‌కు అభివృద్ధి చేయటం చేతకాదు.. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ప్రజలు ఆత్రం సక్కు కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.