mt_logo

వేయని రైతు భరోసాను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు.. ఎంతకాలం ఈ అసత్యాలు: రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా.. తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా. వేయని రైతు భరోసాను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు. ఎంతకాలం ఈ అసత్యాలు అని దుయ్యబట్టారు.

ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి ₹7,500? నాట్ల నాడు ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్‌లా సాగదీశారు. చివరికి పాత రైతుబంధు పూర్తిగా అందలేదు. రైతు భరోసాకైతే అసలు అడ్రస్సే లేదు అని పేర్కొన్నారు.

నాడు.. 15 లక్షలు వేస్తానన్న బడే భాయ్ వేయలేదు. నేడు.. 15 వేలు ఇస్తానన్న ఛోటే బాయ్ ఇయ్యలేదు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు.. అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ ఇంకెన్ని రోజులు అని ప్రశ్నించారు.

డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది.. కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన.. నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన. ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన.. 420 మోసపూరిత వాగ్దానాలతో.. నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన అని ధ్వజమెత్తారు.

ఒక్క మాట మాత్రం నిజం.. గాలిమాటల గ్యారెంటీలను నమ్మి..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ.. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుంది.. తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుంది అని కేటీఆర్ తేల్చి చెప్పారు.