mt_logo

దేవుళ్ల మీద ఒట్టేసే రేవంత్ రెడ్డి.. తన భార్య, పిల్లల మీద ఎందుకు వేయడు?: కేటీఆర్

కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కోనారావుపేటలో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని లొల్లి పెట్టంగనే వానికెవనికో ఓటు వేసిన్రు. రూ. 2500, రూణమాఫీ, రైతు బంధు వచ్చిందా? మార్పు కావాలని అనుకున్నారు.. కానీ ఎట్లైంది అని అడిగారు.

కరెంట్ పోతుందా? నీళ్లకు గోస అయితుందా? ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది..కేసీఆర్ పాలననే బాగుండే అని అనిపిస్తోందా ఏదైనా వస్తువు మన దగ్గర నుంచి పోయినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు పాలిచ్చే బర్రెని వదిలేసి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లైందని అందరూ అనుకుంటున్నారు అని పేర్కొన్నారు.

420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి.. అరచేతిలో వైకుంఠం చూపించిండు. రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టేసి కొత్త నాటకం చాలు చేసిండు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నాడు..పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేసిండు అని విమర్శించారు.

దేవుళ్ల మీద ఎందుకు ఒట్టు పెడుతున్నవ్ రేవంత్ రెడ్డి.. నీ భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టేయవ్. అంటే దేవుళ్లు అడగరు కదా? వాళ్లను ఈజీగా మోసం చేయవచ్చు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు చేయనోడు? రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తాడా? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఉన్నోడు బడేభాయ్.. హైదరాబాద్‌లో ఉన్నోడు కేడీ.. ఇద్దరు మోసగాళ్లు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం, రూ. 15 లక్షలు, అందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు అని మోడీ కథలు చెప్పిండు..ఆ బడే భాయ్ మాటలు విని మనం మోసపోయినం. ఇక్కడ చోటే భాయ్ మొన్నటి అసెంబ్లీలో హామీలిచ్చి మోసం చేసిండు అని కేటీఆర్ దుయ్యబట్టారు.

పార్లమెంట్‌లో వినోదన్న ఉంటే మన సమస్యలను గల్లా పట్టి అడుగుతాడు.. బండి సంజయ్ ఎప్పుడైనా కోనరావు పేటలో కనిపించిండా? టీవీల తప్ప ఎక్కడైనా కనబడ్డడా? ఈ ప్రాంతానికి బుడ్డా పైసా పనిచేసిండా? పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిండా? అని ధ్వజమెత్తారు.

ఏం చేసినవ్ బండి సంజయ్ మా ప్రాంతానికి అంటే జై శ్రీరామ్ అంటాడు.. అక్షింతలు పంపించి దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. మనం కూడా యాదగిరి గుట్ట కట్టినం.. కానీ రాజకీయాలకు మతాన్ని వాడకోలేదు.. శ్రీరాముడు మనకు దేవుడు కాదా? బండి సంజయ్ రాకముందు మనకు దేవుడు తెల్వదా?  రాముని పేరు చెప్పి రామున్ని వీళ్లే కాపాడుతున్నట్లు పిల్లల మనసును కరాబ్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఓడిపోతే దేశంలో, రాష్ట్రంలో ఉన్న దేవుళ్లకు అయ్యేది ఏమీ లేదు. బీజేపీకి ఓటు వేస్తే దేవునికి ఓటు వేసినట్లే అన్నట్లు ప్రచారం చేస్తున్నాడు. మన ప్రాంతానికి పనులు కావాలంటే గట్టిగా మాట్లాడేటోళ్లు కావాలె.. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. ఐదేళ్లలో బండి సంజయ్ పీకిందేమీ లేదు? అని కేటీఆర్ అన్నారు.

బండి సంజయ్ నీకు దమ్ముంటే ఏం పనిచేసినవో చెప్పేందుకు చర్చకు రా.. రాజన్న గుడికి, కొండగట్టు అంజన్నకు ఒక్క రూపాయి తెచ్చినవా సంజయ్?  ఒక్క బడి లేదు, గుడి లేదు, పరిశ్రమ తేలేదు. అలాంటిది నీకు ఎందుకు ఓటు వేయాలే.. అడిగితే గాలి తిరుగుడు తప్ప చేసిందేమీ లేదు అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి 4 వేలు ఇస్తా అన్నాడు. కానీ జనవరి నెల పెన్షన్‌ను ఎగపెట్టిండు. రైతు బంధుకు రాం రాం, దళిత బంధును ఎచ్చకొట్టుడే కాంగ్రెస్ పని.. 10 నుంచి 12 సీట్లు మాకు అప్పగించండి. ఏడాది లోపు మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. ఒక్కోసారి ఓడిపోవటం కూడా మంచిదే.. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది అని తెలిపారు.

అందుకే మీ తరుపున బ్రహ్మండంగా కొట్లాడే నాయకుడు వినోద్ గారిని గెలిపించండి.. సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకనాడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసిన కాంగ్రెస్ మళ్లీ అదే పని చేస్తోంది. కాంగ్రెస్ రాగానే రైతులు, నేతన్న ఆత్మహత్యలు, కరెంట్ పోవుడు, మోటార్లు కాలుడు మళ్లీ స్టార్ట్ అయినయ్.. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే వాళ్ల పేయిల భయం ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలె అని కోరారు.

ఒక్కసారి మోసం పోతే మోసం చేసిన వాడి తప్పు..రెండోసారి మోసం చేస్తే మన తప్పే అవుతది.. వాడు తులం బంగారం కాదు కదా? తులం ఇనుము కూడా ఇయ్యడు. రైతులకు బోనస్ అన్నాడు.. అది బోగస్ ముచ్చట. ఏ నాయకుడు తెలంగాణ తెచ్చిండో ఆ నాయకున్ని గెలిపించుకుందాం.. బంగారం లాంటి చదువుకున్న నాయకుడు వినోద్ గారిని గెలిపించుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.