mt_logo

బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయినవారిని తిరిగి రానివ్వం: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేకే, కడియం లాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు.. వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది అన్నారు.

ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా.. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని కేటీఆర్ స్పష్టం చేశారు.

రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం. 2019లో రంజిత్ రెడ్డి మాదిరి పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారు అని గుర్తు చేశారు.

కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్‌లోకి పోయిన రంజిత్ రెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.. ఇదే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం అని తేల్చి చెప్పారు.

మల్కజ్‌గిరిలో పోటీ చేయాలని విసిరిన సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించలేదు.. ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు.. ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు.. రైతులకు రుణమాఫీ, రూ. 4,000 పించన్లు, రూ. 2,500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కిన్రు.. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారడీలు మిగిలినవి అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏవర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలి.. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలి.. రేవంత్ 5 ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు.. నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు అని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారు.. కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్‌గా మారిండు.. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారా.. లేదా మోడీ కోసమా చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు.. బీజేపీని అపేది బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే, అది బీజేపీకి లాభం అవుతుంది అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్.. బడుగు బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని అన్నారు.

ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడు.. రాష్ట్రంలో బలహీనవర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ గారు అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలి అని పిలునిచ్చారు.

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసిఆర్ గారిని బలోపేతం చేయాలి.. ఈ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్.. 13వ తేదిన జరిగే చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్‌కు ప్రతి ఒక్కరు తరలిరావాలి అని కేటీఆర్ కోరారు.