mt_logo

వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి: భీమదేవరపల్లిలో హరీష్ రావు

కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరుపున ప్రచారంలో భాగంగా భీమదేవరపల్లిలో రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు మోసపూరిత హామీలిచ్చాయి.. వాటిని నమ్మి మోసపోవద్దు. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే హామీల అమలు గురించి ప్రశ్నించాలి. కేసీఆర్ కష్టకాలంలోనూ రైతబంధు ఇచ్చారు.. రేవంత్ రూ. 15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. అక్కాచెల్లెళ్లకు రూ. 2,500 ఇస్తామని మోసం చేశాడు.. రూ. 4 వేల పింఛన్ ఇస్తామని అవ్వాతాతలను మోసం చేశాడు. ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోని కాంగ్రెస్‌ను నమ్మి మళ్లీ మోసపోదామా? అని అడిగారు

రేవంత్ రెడ్డికి తిట్లు లేకపోతే ఒట్లు.. అప్పుడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్స్ మీద ప్రామిస్‌లు. కాంగ్రెస్ బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయి.. దానికి ఎంపీ ఎన్నికల్లో శిక్ష వేయాలి. భీమదేవరపల్లిని, ముల్కనూరును గౌరవించి, ఇక్కడి అభ్యర్థికి టికెటిచ్చింది కేసీఆర్.. మెడికల్ కాలేజీని ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది.. అవన్నీ జూటా మాటలు అని విమర్శించారు.

ఎన్నికల హామీలను అమలు చేయాలని విపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగితే ఆయన కళ్లు పీకి గోలీలు ఆడతానని, పేగులు మెడలో వేసుకుంటానని రేవంత్ అంటున్నాడు. కాంగ్రెస్ అహంకారం దిగాలంటే వినోదన్నను పార్లమెంటుకు పంపాలి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అంటే కరువు, మోటార్లు కాలిపోవడం.. కేసీఆర్ పదేళ్ల హయాంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలోనే రైతులకు ఇన్ని కష్టాలు.. పొలాలు ఎండినాయి, మోటర్లు కాలినాయి. కాంగ్రెస్‌ది రివర్స్ గేర్ పాలన.. మాట తప్పిన కాంగ్రెస్‌కు చురుకుపెట్టాలి.. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే అసెంబ్లీలో వాళ్ల సంగతి తేలుస్తాం అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ఎప్పుడైనా తెలంగాణ అమరులకు నివాళి అర్పించిండా.. బీజేపీ ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా? మోదీ అదానీ, అంబానీలను అపర కుబేరులను చేశాడు, రైతులను నాశనం చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. బీజేపీ పంచరుతున్న కేలండర్లు, అక్షింతలు పంచుతున్నారు.. వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి.. ప్ర్రజల ఆదరణ చూస్తుంటే ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం అని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు కష్టాలు పడుతున్నారు.. వారి సమస్యలు పోవాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలి.. తెలంగాణ కోసం, ప్రజల కోసం రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, 24 గంటల కరెంట్ వంటి ఎన్నో మంచిపనులు చేశారు. ఆనాడు ఆదరించినట్టే మళ్లీ వినోద్ అన్నను ఎంపీ ఎన్నికల్లోనూ ఆదరించాలి అని కోరారు.