mt_logo

హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ నాటికి 100% మురికినీటి శుద్ధి : మంత్రి కేటీఆర్

తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాల్లో మంత్రి కే. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.

”తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ మరియు దాని చుట్టువైపున్న ప్రాంతాల నుంచే 45 నుంచి 50% ఆదాయం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల సంవత్సరాలలో జరిగిన పట్టణీకరణ స్థాయిలో రానున్న 50 సంవత్సరాలలో పట్టణీకరణ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి” అనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐదు సంవత్సరాల్లో మెజార్టీ తెలంగాణ జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుంది. నెలరోజుల వ్యవధిలో విజయవంతంగా హైదరాబాద్ నగరంలో 150 వార్డుల్లో వార్డ్ కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్ఎంసీ ప్రజల పట్ల తన కమిట్మెంట్ ని చాటుకుంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి అభినందనలు. భారతదేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉన్నారని గర్వంగా చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో ఈ సెప్టెంబర్ నాటికి 100% మురికినీటి శుద్ధి చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఘనత సాధించనున్న తొలి నగరంగా హైదరాబాద్ మారనున్నది” అనే విశ్వాసం కనబరిచారు.