mt_logo

‘మా తండా – మా రాజ్యం’ స్వయం పాలన కల నెరవేర్చిన ఏకైక సీఎం కేసీఆర్

  • గ్రామపంచాయతీలుగా తండాలు
  • నగరం నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాలు
  • రిజర్వేషన్ పది శాతానికి పెంపు

హైదరాబాద్, జూన్ 17: ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆదివాసీ గిరిజనుల రాజకీయ సాధికారత దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల ఏళ్లనాటి కలను సాకారం చేస్తూ తండాలకు స్వయంపాలనా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో వారి సామాజిక అభివృద్ధికి శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్రను సృష్టించారు. 500 జనాభా పై బడిన 3146 గిరిజన తండాలు, గోండు గూడేలు, చెంచు పెంటలను కొత్త గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చింది. అటు పరిపాలనలో భాగస్వామ్యం చేయడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలతో గణనీయమైన మార్పుకు నాంది పలుకుతూ గతంలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం పెంచిన రిజర్వేషన్‌ ద్వారా గిరిజన విద్యార్థులకు విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ఈ రిజర్వేషన్ పెంపు ద్వారా గత ఏడాది ఇంజనీరింగ్ లో 3195 సీట్లు, మెడికల్ లో 189 సీట్లు అదనంగా లభించాయి. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా వందలాది పోస్టులు అదనంగా వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రూ. 53 ,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం షాపుల లైసెన్స్ 5 శాతం రిజర్వేషన్ కల్పించటం వలన 131 మంది ఎస్టీ కుటుంబాలకు లాభం చేకూరింది. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు లక్షా 55 వేల మందికి రూ.1306 .25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్రంలోని 8.2 లక్షల గిరిజన రైతులకు రూ.8305 .40 కోట్ల రూపాయలను రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించారు. అదే విధంగా 3 .5 లక్షల మంది గిరిజనులకు రూ.4500 కోట్ల రూపాయల ఆసరా ఫించన్లను పంపిణీ చేశారు. గిరిజనులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు 11 ,261 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి 9929 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 7 .2 లక్షల గిరిజన కుటుంబాలకు త్రాగు నీరు అందిస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం కింద 1.71 కోట్ల రూపాయలతో 1.86 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.

పోడు భూములకు పట్టాలు:
కొన్ని ఏండ్లగా గిరిజన రైతులు పోడు భూములలో సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు తమకే చెందాలని పోరాడారు. దశాబ్దాలుగా అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కల్పిస్తూ పోడు చేసుకుంటున్న రైతులకే పట్టాలు అందించాలనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు అందించడంతో పాటు రైతు బంధు పథకంను వర్తింప చేయనున్నారు. జూన్ 24 నుండి పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు.

గిరిజనుల విద్యా వికాసం:
గిరిజనులకు నాణ్యమైన విద్యా అందించాలనే లక్ష్యం తో రాష్ట్రం ఏర్పడిన తరవాత కొత్తగా 94 గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు వాటిని కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. ఎస్టీ గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో 265 మంది ఐఐటీలలో, 374 మంద ఎన్ఐటీలలో, ముగ్గురు ఐఐఎం లో 273మంది ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో, 190మంది వైద్య కళాశాలల్లో, 205మంది కేంద్ర విశ్వవిద్యాలయాలలో మొత్తం 1310 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అంతేకాకుండా ఎస్టీ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో పీజీ కళాశాల, ఫైన్ ఆర్ట్స్ కళాశాల, న్యాయ కళాశాల , సైనిక కళాశాలలు లాంటి ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రతిష్టాత్మక ఐఐటీ, వైద్య విద్య ప్రవేశ పరీక్షకు వసతి తో కూడిన కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా 1432 ప్రాథమిక పాఠశాలలను ఆధునీకరించారు. ఆశ్రమ పాఠశాలలలో 309 ఈ-స్టూడియో , 316 కంప్యూటర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడంతో ఆధునిక క్లాస్ రూములు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 యూనివర్సిటీలలో 140 కోట్లతో ఒక్కో యూనివర్సిటీలో 500 మందికి వసతి కల్పించే విధంగా బాలురు, బాలికలకు వేరువేరుగా వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో బీఏఎస్ పథకం ద్వారా అంధిస్తున్న 30 వేల రూపాయలను రూ.42 వేలకు పెంచారు. అందుకు గత తొమ్మిదేండ్లల్లో రూ.157 .25 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 10 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించడంతో ఉద్యోగాలు చేస్తున్న గిరిజన మహిళలకు వసతి లభించింది.

గిరిజన ఆరోగ్య సంరక్షణ:
గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు ఆయా ప్రాంతాల్లో 133 ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించారు. మారుమూల తండాలలో పౌష్టికాహారం లోపంతో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ములుగు, భద్రాచలం, ఆసిఫాబాద్ వంటి జిల్లాలలో 13098 మంది గిరిజిన తల్లులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు రూ.6 కోట్ల ఖర్చుతో గిరిపోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందించి పౌష్టికాహార లోపాలను గణనీయంగా తగ్గించారు. అలాగే ఆదిమ గిరిజన జాతులు నివాసముండే 10 జిల్లాలలో ప్రత్యేకంగా వారి పౌష్టికాహార లోపాలను సరిదిద్దుటకు రూ.8 కోట్లతో 16375 మంది గిరిజన తల్లులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు గిరి పోషణ కార్యక్రమాన్ని చేపట్టారు. గిరి బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం క్రింద 160 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో 1.2 లక్షల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య భద్రతను కల్పించారు. గిరిజన ప్రాంతాలలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు 12 ప్రభుత్వ నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల ద్వారా 128 మందికి జీఎన్ఎం. 108 మందికి డిఎంఎల్ట్ , 23 మందికి డీఓటి శిక్షణ అందించారు.

గిరిజన సంస్కృతి పరిరక్షణ:
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పండుగలను ప్రభుత్వ పండుగలుగా గుర్తించి వాటి నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. మేడారం జాతరతో పాటుగా సంత్ సేవాలాల్, నాగోబా, కొమురం భీం, బౌరాపూర్, పెరాల్, అంగుబాయి, పూలాజీ బాబా జయంతి, గాంధారి మైసమ్మ, ఏరుకుల నాంచారమ్మ లాంటి గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.356 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారం లో మౌలిక సదుపాయాలను కల్పించారు. అదే విధంగా కోటి రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా జోడేఘాట్, మేడారం,భద్రాచలం, మన్ననూర్ లలో గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేశారు.

ఆర్థిక అభివృద్ధి పథకాలు:
“సీఎం ఎస్టీ ఎంట్రిప్రెన్యూర్‌షిప్ పథకం” క్రింద ఇప్పటి వరకు 109 ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ 44.51 కోట్ల సహాయం అందజేశారు. ఈ పథకం కింద గత ఏడాది 100 మంది వరకు ఉన్న పరిమితి ఈ ఏడాది నుండి 200 మందికి పెంచి మరింత మందికి అవకాశం కలిపిస్తున్నారు. ఇప్పటి వరకు 91 మంది సుమారుగా. రూ.103 కోట్లతో వివిధ రకాల యూనిట్లు ప్రారంభించడం జరిగింది. “సీ.ఎం. గిరి వికాసం” పథకం క్రింద ఇప్పటివరకు 19698 గిరిజన రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ 98.23 కోట్లతో 56,673 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి, సాగు నీటి సౌకర్యం కల్పించారు. గిరిజన డ్రైవర్లను స్వంత వాహనాల యజమానులను చేసేందుకు డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం క్రింద ఇప్పటివరకు 441 మంది గిరిజనులకు రూ.19.56 కోట్ల సహాయం చేశారు. స్వయం ఉపాధి శిక్షణతో ఇప్పటివరకు 36975 గిరిజన యువతకు రూ.129.41 కోట్లతో శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పించారు.

మౌలిక వసతులు:
రాష్ట్రంలోని అన్ని ఆదివాసి గూడాలు, తాండాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో 2014 నుండి 2022 వరకు రూ 1275.87 కోట్లతో సుమారు 1682 గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్డు సౌకర్యం కలిపించారు. అలాగే ఈ ఏడాది రూ. 2059.27 కోట్లు మంజూరుతో సుమారు 1582 గిరిజన ఆవాసాలకు బీట్ రోడ్డు సౌకర్యం కల్పించనున్నారు. గిరిజనులకు ప్రత్యేక భవనాలకు 121.86 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58 గిరిజన భవనాలు మంజూరు చేశారు. అంతేగాకుండా హైదరాబాదు నగర నడిబొడ్డున బంజారా హిల్స్ ప్రాంతంలో కొమరం భీం ఆదివాసీ భవనం, శ్రీ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించడం గిరిజనులకు సువర్ణావకాశం.

విద్యుత్:
తెలంగాణలోని గిరిజన ఆవాసాలన్నింటికీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. మొత్తం 3467 గిరిజన ఆవాసాలకు రూ.221 కోట్లతో వ్యవసాయ అవసరాలకు గాను త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి 2.5 లక్షల ఎకరాలలో పంట సాగుకు తోడ్పడుతుంది. మొత్తం 1.01 లక్షల ఒక వెయ్యి గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు రూ.19 కోట్లు వెచ్చించింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ గిరిజనుల విద్య, ఆరోగ్య, ఆర్ధిక సామాజిక సంక్షేమానికి కృషి చేస్తున్నారు.